కీరవాణి అది తప్పని ఋజువు చేయాలి

సంగీత ప్రియులకు పరిచయమే అక్కర్లేని పేరు ఎంఎం కీరవాణి. 1990లో మనసు మమత అనే చిన్న సినిమాతో ప్రయాణం మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ స్టేజి ఎక్కడం దాకా ఆయన చేసిన ప్రయాణం గురించి గంటల తరబడి మాట్లాడుకోవచ్చు.

ఘరానా మొగుడు లాంటి మాస్ మసాలా బ్లాక్ బస్టర్ కు సాంగ్స్ కంపోజ్ చేసినా, అన్నమయ్య లాంటి డివోషనల్ ఆల్బమ్ కు పాటలు స్వరకల్పన చేసినా చిరస్థాయిగా నిలిచిపోయేలా చేయడం ఆయనకే చెల్లింది. నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘమైన కెరీర్ లో కీరవాణి ఎంతో కాంపిటీషన్ తట్టుకుని ఇక్కడిదాకా వచ్చారు. అయితే కొన్నేళ్లుగా ఒక్క విషయంలో ట్రిగ్గర్ అవుతున్నారు.

రాజమౌళి దర్శకత్వం వహించే ప్యాన్ ఇండియా మూవీస్ కు గొప్ప సంగీతం అందించే ఈ మరగతమణి ఇతరులకు మాత్రం ఆ స్థాయి అవుట్ ఫుట్ ఇవ్వడంలో విఫలమవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు మొదటిసారి స్వరపరిచే అవకాశం హరిహర వీరమల్లుతో దక్కింది. అది డిజాస్టరే కావొచ్చు కానీ కీరవాణి మరీ గుర్తుండిపోయే స్థాయిలో పాటలు ఇవ్వలేదన్నది అభిమానులే ఒప్పుకుంటారు.

చిరంజీవి విశ్వంభర కోసం చేసిన శ్రీరామనవమి పాట కూడా సోసోగానే రీచ్ తెచ్చుకుంది. వీటికన్నా ముందు లవ్ మీ ఇఫ్ యు డేర్, జయమ్మ పంచాయితీ, కొండపోలం, ఎన్టీఆర్ బయోపిక్ ఇవేవి మ్యూజిక్ లవర్స్ కి మెమరబుల్ కాలేకపోయాయి.

ఒక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే చార్ట్ బస్టర్ అనిపించుకుని ఆస్కార్ సాధించింది. అది జక్కన్న డైరెక్షన్ కాబట్టి. రోషన్ పెళ్లి సందడి లాంటివి ఓ మోస్తరుగా పాసయ్యాయి కానీ ఇంకేవి కూడా నాన్ రాజమౌళి సినిమాల్లో గొప్పగా నిలవలేదు.

ఇప్పుడీ టాపిక్ కు కారణం, ప్రశాంత్ వర్మ – రిషబ్ శెట్టి కలయికలో తెరకెక్కబోయే జై హనుమాన్ సినిమాకు కీరవాణే సంగీతం సమకూర్చబోతున్నారనే వార్త బయటికి రావడం. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ సిట్టింగ్స్ అయితే జరిగాయి. వారణాసికి పని చేస్తూనే ఇప్పుడీ జై హనుమాన్ కు కీరవాణి ఎలాంటి బెస్ట్ ఇస్తారనేది వేచి చూడాలి. రెండూ 2027లోనే రిలీజయ్యే ఆవకాశాలుండటం మరో విశేషం.