చిరు – త్రిష – ఖుష్బూ మీద మన్సూర్ కేసులు

లియో హీరోయిన్ త్రిష మీద అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి విమర్శలకు గురైన నటుడు మన్సూర్ అలీ ఖాన్ తర్వాత తన కామెంట్లను సమర్ధించుకునే ప్రయత్నం విపరీతంగా చేశాడు. అయినా సరే నెగటివిటీ ఆగలేదు. ఏదో లాజిక్ గా మాట్లాడుతున్నాననుకుని ఏదేదో అనేశాడు. వ్యవహారం దూరం వెళ్ళిపోయి తనకు అవకాశం ఇచ్చిన లోకేష్ కనగరాజ్ సైతం ఖండించడంతో పాటు కోలీవుడ్ పెద్దలు తలంటడంతో ఎట్టకేలకు వెనక్కు తగ్గాడు. మొన్నే త్రిషకు క్షమాపణ చెబుతూ ట్విట్టర్ లో ఓ పెద్ద మెసేజ్ పెట్టాడు. ఆమె స్పందిస్తూ తప్పులు అందరూ చేస్తారని ఇక్కడితో వదిలేద్దామనే సంకేతం ఇచ్చింది.

సరే కథ సుఖాంతమయ్యిందనే అందరూ అనుకున్నారు. కట్ చేస్తే మన్సూర్ అలీ ఖాన్ ఇప్పుడు త్రిష మీద పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు వేయబోతున్నాడు. ఇక్కడితో ఆగలేదు. తనకు చెడ్డపేరు వచ్చేలా మాటలు, చర్యలతో స్పందించిన చిరంజీవి, ఖుష్బూలను కూడా ఇందులో చేర్చేశాడు. దీంతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. సారీ చెప్పాక ఒకటి రెండు రోజుల్లో అందరూ మర్చిపోయేవాళ్లు. ఇప్పుడు మళ్ళీ దావాలు, కేసులంటూ కొత్త వివాదానికి తెరతీయడం ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పలేం. పైగా ఏకంగా మెగాస్టార్ ని ఇందులో లాగడం టూ మచ్ అనే చెప్పాలి.

దీనికి సంబంధించిన మరికొన్ని కీలక అప్డేట్స్ మెల్లగా వస్తాయి. తాను అన్న వాటిని వక్రీకరించారని పదే పదే చెబుతున్న మన్సూర్ అలీ ఖాన్ అసలు లియో కథ ప్రకారం తాను త్రిష కలుసుకునే అవకాశమే సినిమాలో లేనప్పుడు అక్కర్లేని విషయాలు ఎందుకు ప్రస్తావించాలనే దాని గురించి మాత్రం సమాధానం చెప్పడం లేదు. ఏదో పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టు ఉంది తప్పించి ఆరిపోయిన నిప్పును మళ్ళీ పెట్రోల్ వేసి వెలిగిస్తున్న మన్సూర్ ప్రవర్తన గురించి తమిళ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతోంది. చిరంజీవితో మన్సూర్ కు ముఠామేస్త్రి లాంటి సూపర్ హిట్స్ లో నటించిన అనుభవముంది.