విశ్వక్ సేన్ గ్యాంగ్స్ అఫ్ గోదావరి డిసెంబర్ 8 నుంచి తప్పుకుంది. యూనిట్ అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ రిలీజ్ అవకాశం ఎంత మాత్రం లేదు. 29న విడుదల చేసే ఆలోచన జరిగినా ఇంకా పది రోజుల షూట్ బ్యాలన్స్ ఉండటంతో అది కూడా అనుమానంగానే ఉంది. పైగా సలార్ వచ్చిన వారానికే అంటే ఖచ్చితంగా రిస్క్ అవుతుంది. ప్రభాస్ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ సునామి ముందు ఎవరూ నిలవలేరు. అందుకే దాని కన్నా వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఇక జనవరిలో సంక్రాంతి సినిమాల హడావిడి తెలిసిందే. ఉన్నవాళ్ళకే థియేటర్లు కష్టం కనక పండక్కు నో ఛాన్స్.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం గ్యాంగ్స్ అఫ్ గోదావరిని మార్చిలో రిలీజ్ చేసే దిశగా చర్చిస్తున్నారట. విశ్వక్ సీన్ ఇటీవలే దీని షూటింగ్ లోనే చిన్న ప్రమాదానికి గురయ్యాడు. యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనకుండా డాక్టర్లు కొంత రెస్ట్ సూచించడంతో బయట ఈవెంట్లలో కనిపిస్తున్నా చిత్రీకరణలో పాల్గొనలేని పరిస్థితి ఉందట. పోస్ట్ పోన్ చేస్తే ఫిబ్రవరి లేదా మార్చ్ లోనే రావాలి. ఎందుకంటే ఏప్రిల్ లో జూనియర్ ఎన్టీఆర్ దేవర, సూర్య కంగువ, కమల్ హాసన్ భారతీయుడు 2 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇంకా పెద్ద ముప్పు. వీలైనంత మేరకు కాంపిటీషన్ లేని డేట్ దొరకడం అవసరం.
ఇప్పుడు బ్యాలన్స్ ఉన్న భాగంలో కూడా అంజలి లాంటి ఆర్టిస్టుల డేట్లు అందుబాటులో లేకపోవడం ఇంకో సమస్యగా చెబుతున్నారు. చెప్పిన టైంకి రాకపోతే దీని ప్రమోషన్లలో కనిపించనని శపథం చేసిన విశ్వక్ సేన్ ఆ మాటకే కట్టుబడాల్సిన అవసరం లేదు. అనుకోకుండా కలిగిన గాయం కాబట్టి దాన్నుంచి కోలుకోవడం కన్నా పంతం ముఖ్యం కాదు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ అఫ్ గోదావరిలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. సముద్ర తీరంలో జరిగే గొడవలు, మాఫియాలు, రౌడీ గ్యాంగుల నేపథ్యంలో చాలా ఇంటెన్స్ డ్రామాగా ఇది రూపొందుతోందని ఇన్ సైడ్ టాక్.