‘స‌ప్త‌సాగ‌రాలు దాటి’పై నిర్మాత కామెంట్స్ వైర‌ల్

టాలీవుడ్ నిర్మాత‌ల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ స్ట‌యిలే వేరు. త‌న‌కు ఏమ‌నిపిస్తే అది మాట్లాడుతూ.. కొన్నిసార్లు వివాదాల్లో భాగ‌మ‌వుతూ సోష‌ల్ మీడియాలో త‌ర‌చుగా హాట్ టాపిక్ అవుతుంటాడు నాగవంశీ. ఆ మ‌ధ్య అవ‌తార్-2 సినిమా మీద నాగ‌వంశీ విమ‌ర్శ‌లు చేయ‌డం ఎంత చ‌ర్చ‌నీయాంశం అయిందో తెలిసిందే. ఇటీవ‌ల త‌న నిర్మాణంలో వ‌చ్చిన మ్యాడ్ మూవీ.. జాతిర‌త్నాలుతో పోలిస్తే త‌క్కువ కామెడీ ఉంద‌ని, స‌రిగా న‌వ్వ‌లేద‌ని ఎవ‌రైనా అంటే టికెట్ డ‌బ్బులు వెన‌క్కిచ్చేస్తానంటూ ఆయ‌న చేసిన కామెంట్ కూడా వైర‌ల్ అయింది.

క‌ట్ చేస్తే ఇప్పుడు క‌న్న‌డ హిట్ మూవీ స‌ప్త‌సాగ‌రాలు దాటి మీద నాగ‌వంశీ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఒక వెబ్ పోర్ట‌ల్ చ‌ర్చా వేదిక‌లో క‌ల‌ర్స్ స్వాతి, శోభు యార్ల‌గ‌డ్డ‌, ప్రియ‌ద‌ర్శి త‌దిత‌రుల‌తో క‌లిసి పాల్గొన్నాడు నాగ‌వంశీ.

ఈ సంద‌ర్భంగా స‌ప్త‌సాగ‌రాలు దాటి-సైడ్ బి సినిమా చూశారా అని అడిగితే.. అలాంటి సినిమాలు చూసే ఛాన్సే లేద‌ని తేల్చేశాడు నాగ‌వంశీ. ఆల్రెడీ జీవితంలో ఉన్న డిప్రెష‌న్లు చాల‌ని.. మ‌ళ్లీ సినిమా చూసి డిప్రెష‌న్లు తెచ్చుకోవాల్సిన ప‌ని లేద‌ని అత‌న‌న్నాడు. డ‌బ్బులిచ్చి మ‌రీ థియేట‌ర్ల‌కు వెళ్లి ఏడ‌వాల్సిన అవ‌స‌రం లేద‌ని నాగ‌వంశీ అన్నాడు. ఇలాంటి సినిమాలు చూస్తే ఒక కొత్త కోణం తెలుస్తుంది క‌దా అని స్వాతి అన‌గా.. తాను మాత్రం సినిమా అంతా బాధే ఉన్న ఇలాంటి సినిమాలు చూడ‌నంటే చూడ‌న‌ని తేల్చేశాడు.

ఇక ఈ చ‌ర్చ‌లో భాగంగా బాగున్న సినిమాలు ఆడ‌తాయి, బాలేనివి ఆడ‌వ‌న్న‌ట్లుగా మిగ‌తా వాళ్లు మాట్లాడ‌గా.. త‌న సినిమా మంత్ ఆఫ్ మ‌ధు స‌రిగా ఆడ‌లేదంటే అది బాలేద‌ని అర్థ‌మా అని స్వాతి ప్ర‌శ్నించ‌గా.. ఆ టైంలో ఐదు సినిమాల‌తో పోటీ ఉండ‌టం ప్ర‌భావం చూపి ఉండొచ్చ‌ని నాగ‌వంశీ అన్నాడు.