హీరోగా సక్సెస్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

విలన్, క్యారెక్టర్ వేషాలతో కెరీర్‌ను ఆరంభించి ఆ తర్వాత హీరోగా కొన్నేళ్ల పాటు మంచి స్థాయిలో ఉన్నాడు శ్రీకాంత్. మిడ్ రేంజ్ ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ సినిమాలకు అతను అప్పట్లో బెస్ట్ ఛాయిస్ అనిపించేవాడు. ఐతే 2000 తర్వాత శ్రీకాంత్ ఊపు తగ్గుతూ వచ్చింది. హీరోగా మార్కెట్ దెబ్బ తింది. అవకాశాలు తగ్గిపోయాయి. ఒక దశలో శ్రీకాంత్ హీరోగా నటించిన సినిమాలను జనం పట్టించుకోవడమే మానేశారు. దీంతో తిరిగి క్యారెక్టర్, విలన్ రోల్స్‌లోకి మారక తప్పలేదు. ఈ పాత్రలతో మళ్లీ బిజీ అయిన శ్రీకాంత్ హీరోగా కెరీర్ మీద పూర్తిగా ఆశలు కోల్పోయాడు.

ఐతే ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత శ్రీకాంత్‌కు హీరోగా ఓ మంచి సినిమా పడింది. అదే.. కోటబొమ్మాళి పీఎస్. నిజానికి ఇందులో ఆయనది హీరో కాని హీరో రోల్. కథ ప్రధానంగా సాగే సినిమాలో ముగ్గురు లీడ్ రోల్స్ చేయగా.. అందులో శ్రీకాంత్ పాత్రే కీలకంగా ఉంటుంది. కథంతా ఆయన మీదే నడుస్తుంది.

మలయాళం ఒరిజినల్లో జోజు జార్జ్ అద్భుత అభినయం ప్రదర్శించిన ఈ పాత్రను తెలుగులో శ్రీకాంత్ ఏమాత్రం పండిస్తాడో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ సినిమా చూసిన వాళ్లందరూ శ్రీకాంత్ నటనకు ఫిదా అవుతున్నారు. ఒరిజినల్‌తో పోలిస్తే తెలుగులో ఈ పాత్రకు మరింత ఎలివేషన్ దక్కింది. క్లైమాక్స్‌లో ఆ పాత్ర బాగా హైలైట్ అయింది.

మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆ పాత్రకు మంచి ఎలివేషన్ ఇచ్చి సినిమాను ముగించారు. ఈ పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. హై ఇంటెన్సిటీతో సాగే ఈ పాత్రకు శ్రీకాంత్ పూర్తి న్యాయం చేశాడు. పాత్రలోని సంఘర్షణను తెరపై బాగా చూపించగలిగాడు. చివర్లో ఈ పాత్ర కన్నీళ్లు పెట్టిస్తుంది. పెర్ఫామెన్స్ పరంగా శ్రీకాంత్ అందరినీ పక్కకు నెట్టేశాడు. హీరోగా ఆయనకు చాలా ఏళ్ల తర్వాత దక్కిన మంచి పాత్రను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. బాక్సాఫీస్ దగ్గర ‘కోటబొమ్మాళి పీఎస్’ మంచి ఫలితమే అందుకునేలా కనిపిస్తోంది.