అనిమల్ సునామి మీద దిల్ రాజు నమ్మకం

ఇంకో ఆరు రోజుల్లో విడుదల కాబోతున్న అనిమల్ ఫీవర్ క్రమంగా మూవీ లవర్స్ ని కమ్మేస్తోంది. ట్రైలర్ వచ్చాక ఒక్కసారిగా హైప్ పెరిగిపోవడంతో టికెట్ల కోసం డిమాండ్ మాములుగా లేదు. 3 గంటల 21 నిమిషాల నిడివి గురించి తొలుత నెగటివ్ గా ప్రచారం జరిగినా ఇప్పుడు సందీప్ వంగా కోసం ఎంతసేపైనా థియేటర్ లో ఉంటామని అభిమానులు అంటున్నారు. హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ మాములు జోరు మీద లేవు. క్రేజ్ ఉన్న మల్టీప్లెక్సుల్లో టికెట్లు పెట్టడం ఆలస్యం నిమిషాల్లో ఆరంజ్ మార్కు పడుతున్నాయి. చూసుకోవడం ఆలస్యమైతే చాలు ముందు వరస సీట్లే గతి.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హక్కులను సొంతం చేసుకున్న నిర్మాత దిల్ రాజు మొత్తం 15 కోట్లకు ఒప్పందం చేసుకున్నారట. మాములు పరిస్థితుల్లో అయితే రన్బీర్ కపూర్ సినిమాకు ఇది చాలా పెద్ద మొత్తం. కానీ ఇక్కడ సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ తోడయ్యింది. కంటెంట్ మీద ఉన్న అంచనాలు మీటర్ ని పెంచుతోంది. దీంతో సహజంగానే ఎక్కువ రేట్ చెప్పడం న్యాయమే. అన్ని క్యాలికులేషన్లు సరిచూసుకుని రాజుగారు ఆ మొత్తానికి ఎస్ చెప్పారట. డిసెంబర్ 1 ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ముందురు రోజు రాత్రి ప్రీమియర్లతో మొదలుపెట్టి భారీ ఎత్తున్న ప్లానింగ్ జరుగుతోందట.

సరే ఇంత మొత్తం రికవరీ అవుతుందా అంటే ఖచ్చితంగా ఔననే చెప్పాలి. అనిమల్ కు యావరేజ్ టాక్ వచ్చినా చాలు కనీసం వారం రోజులు ఫుల్స్ పెడతాడు. పైగా నెలరోజుల నుంచి చెప్పుకోదగ్గ మూవీ లేక సినీ ప్రేమికులు అల్లాడిపోతున్నారు. అందుకే అనిమల్ మీదే అందరి చూపు ఉంది. విపరీతమైన వయోలెన్స్, ఏ సర్టిఫికెట్ లాంటి పరిమితులు కలెక్షన్లను ఆపే పరిస్థితి లేదు. ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు రన్బీర్, సందీప్ వంగాలు. పోటీ లేకపోవడం అనిమల్ కు మరో పెద్ద సానుకూలాంశం. ఇప్పటిదాకా ఏ హిందీ సినిమాకు ఇవ్వనన్ని స్క్రీన్లు తెలుగు రాష్ట్రాల్లో కేటాయిస్తారని టాక్.