గృహం దర్శకుడి వికృతమైన సిరీస్

సిద్దార్థ్, ఆండ్రియా జంటగా 2017లో వచ్చిన హారర్ మూవీ గృహం తెలుగులోనూ మంచి విజయం నమోదు చేసుకుంది. తక్కువ బడ్జెట్ లో రూపొంది కమర్షియల్ గా నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది. దర్శకుడు మిలింద్ రావు పేరు బాగా వినిపించింది. తర్వాత నయనతారతో నేత్రికన్ తీశాడు కానీ అది డైరెక్ట్ ఓటిటి రిలీజ్ జరుపుకోవడంతో దాని స్టామినా బయట పడలేదు. అయితే టెక్నికల్ గా పేరు తెచ్చుకుంది. ఇతను తాజాగా వెబ్ సిరీస్ లో అడుగు పెట్టాడు. వరుడు విలన్ ఆర్య, మంగళవారంలో కీలక పాత్ర పోషించిన దివ్య పిళ్ళై జంటగా ‘ది విలేజ్’ ప్రధాన భాషల్లో మొన్న శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

చెన్నైకు వెళ్లే దారిలో ఓ అర్ధరాత్రి తూత్తుకూడి జిల్లాలోని కట్టియల్ అనే గ్రామం దగ్గర డాక్టర్ గౌతమ్(ఆర్య )కారు పంచరై భార్యా కూతుర్ని వదిలి సహాయం వెతుకుతూ వెళ్తాడు. అయితే అక్కడ ప్రమాదకరమైన నరరూప రాక్షసులు, దెయ్యాలు ఉన్నాయని దగ్గర్లోని సారా కొట్టు బృందం ద్వారా తెలుసుకుని ముగ్గుర్ని వెంటబెట్టుకుని వేట మొదలుపెడతాడు. అలా ఓ భూగర్భంలో వికృతమైన ఆకారాలతో ఉన్న మనుషులు చేస్తున్న దారుణాలు చూసి కళ్ళు తిరుగుతాయి. ఇదంతా ఒక సైంటిస్ట్(జయప్రకాష్) చేసిన ప్రయోగం వల్లని తెలుస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది స్మార్ట్ స్క్రీన్ మీదే చూడాలి.

మొదటి మూడు భాగాలు మంచి టెంపో, థ్రిల్ తో నడిపించే మిలింద్ రావు నాలుగో ఎపిసోడ్ నుంచి ఘోరంగా కనిపించే వికృత రూపాలతో జుగుప్స కలిగించే రీతిలో హింసని జొప్పించడం మొహం పక్కకు తిప్పుకునేలా ఉంది. పైగా నిడివి ఎక్కువగా ఉండటంతో వయొలెన్స్ హద్దులు దాటేసింది. సగం సిరీస్ అయ్యాక అసలు సాగతీత మొదలై ఫ్లాష్ బ్యాక్ లో సహనం పీక్స్ కి చేరుకుంటుంది. కొన్ని సీన్లు మరీ వాంతొచ్చేలా తీశాడు మిలింద్ రావు. హిల్స్ హావ్ ఐస్, రాంగ్ టర్న్ లాంటి హ్యనిబాల్ సినిమాలను స్ఫూర్తిగా తీసుకున్న మిలింద్ రావు ది విలేజ్ ని మాత్రం భయం కన్నా ఎక్కువ బాబోయ్ అనిపించేలా తీశాడు.