అక్కినేని వారు హర్టు

టాలీవుడ్లో బడా ఫ్యామిలీస్‌లో అక్కినేని వారిది ఒకటి. ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు రెండు కళ్లలో ఒకటిగా ఉన్న అక్కినేని నాగేశ్వరరావు వారసత్వంతో తర్వాతి తరం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఐతే ఏఎన్నార్ తర్వాత నాగార్జున ఒక్కడే ఆశించిన స్థాయిని అందుకున్నాడు. అతను తండ్రిలా ఇండస్ట్రీని ఏలకపోయినా.. వైవిధ్యమైన సినిమాలతో, కొన్ని బ్లాక్‌బస్టర్లతో టాప్ స్టార్లలో ఒకడిగా కొనసాగాడు.

కానీ గత కొన్నేళ్లలో నాగ్ కూడా ఫాలోయింగ్, మార్కెట్‌ను బాగా దెబ్బ తీసుకున్నాడు. ఇక నాగ్ వారసులు ఇద్దరూ కూడా ఆశించిన స్థాయిలో రాణించట్లేదు. మొదట్లో మాస్ ఇమేజ్ కోసం తపించి.. ఆ తర్వాత తనకది సెట్ కాదని లవ్ స్టోరీలకు సెటిలైపోయాడు నాగచైతన్య. అతను మీడియం రేంజ్ హీరోగా స్థిరపడిపోయాడు. కనీసం అఖిల్ అయినా మాస్ హీరో అవుతాడనుకుంటే.. అతను ఒక హిట్టు కూడా లేక అల్లాడిపోతున్నాడు.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తొలి విజయాన్నందిస్తే అందించొచ్చు కానీ.. అఖిల్ స్టార్ కావడానికి ఉపయోగపడుతుందా అన్నది డౌటే. అందుకే నాగార్జున ఎంతో కష్టపడి సురేందర్ రెడ్డిని లైన్లో పెట్టాడు. అతడి దర్శకత్వంలో రూ.45 కోట్ల బడ్జెట్లో అఖిల్ హీరోగా 14 రీల్స్ ప్లస్ వాళ్లు ఓ సినిమా చేయబోతున్నారని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ సినిమాతో అఖిల్ రాత మారుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు సురేందర్.

పవన్ కళ్యాణ్ హీరోగా రామ్ తాళ్ళూరి నిర్మాణంలో అతడిక సినిమా చేసే అవకాశం వచ్చింది. తన ఒకప్పటి మిత్రుడే అయిన వక్కంతం వంశీ దీనికి కథ అందిస్తున్నాడు. మొన్నటిదాకా అఖిల్ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చినట్లు కనిపించిన సూరి.. ఇప్పుడిలా యుటర్న్ తీసుకుని పవన్ సినిమాకు వెళ్లిపోతాడని ఎవరూ ఊహించలేదు. ఈ పరిణామంతో అక్కినేని వారు షాకయ్యారని.. నాగ్, అఖిల్ ఇద్దరూ కూడా సూరి నిర్ణయంతో హర్టయ్యారని సమాచారం. మరి అఖిల్ కోసం ఇంకే స్టార్ డైరెక్టర్‌ను తీసుకొస్తాడో నాగ్.