కోట్లాది అభిమానుల కలలను కల్లలు చేస్తూ నిన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా ఓడిపోవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. పోరాడి ఓటమి చెందితే అంత బాధ ఉండదు కానీ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ హెడ్ వీరంగం ఆడిన చోట మనవాళ్ళు నలభై ఓవర్లలో కేవలం నాలుగు ఫోర్లే కొట్టడం అవమాన భారంగా మారిపోయింది. నిన్న మనం గెలుస్తామనే నమ్మకంతో ఫ్యాన్స్ ఇళ్లలో టీవీలకు అతుక్కుపోయారు. పబ్లిక్ ప్లేసుల్లో వేసిన ఓపెన్ స్క్రీనింగ్స్ కి వెల్లువలా వచ్చి చూశారు. హైదరాబాద్ ప్రైవేట్ క్లబ్స్ లో రెండు వేల రూపాయల టికెట్ రేట్ పెట్టినా లెక్క చేయలేదు.
దేశవ్యాప్తంగా ఆదివారమంతా ఇదే పరిస్థితి. దెబ్బకు బాక్సాఫీస్ సెలవు రోజు కుదేలైపోయింది. నిన్న హిట్ టాక్ వచ్చిన మంగళవారంతో సహా ఏ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు నమోదు కాకపోవడం బయ్యర్లను నిరాశకు గురి చేసింది. ముఖ్య నగరాల్లో ఒక్కటంటే ఒక్క షో హౌస్ ఫుల్ కాలేకపోవడం పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇక బిసి సెంటర్ల సంగతి చెప్పనక్కర్లేదు. చాలా చోట్ల మధ్యాన్నం సాయంత్రం షోలు రద్దు చేయాల్సి వచ్చింది. ఒకవేళ భారత్ గెలుపొంది ఉంటే ఆ ఆనందంలో ఈ లోటు తెలిసొచ్చేది కాదు కానీ రెండు వైపులా మునిగినట్టు పుణ్యం పురుషార్థం ఏదీ దక్కలేదు.
ఒక అంచనా ప్రకారం నిన్న మొత్తం అన్ని బాషల సినీ పరిశ్రమలు కలిపి ఎంత లేదన్నా యాభై నుంచి వంద కోట్ల థియేట్రికల్ రెవిన్యూని నష్టపోయాయట. మనం ఓడిపోవడం ఖాయమని తెలిసే నాటికి సెకండ్ షో టైం వచ్చేయడంతో అప్పటికప్పుడు థియేటర్లకు వెళ్లే ఓపిక లేక జనం ఇంట్లోనే ఉండిపోవడం వసూళ్ల మీద ప్రభావంక చూపించింది. ఇక క్రికెట్ సంబరం అయిపోయింది కాబట్టి ప్రేక్షకుల దృష్టి క్రమంగా సినిమాల వైపు వచ్చేస్తుంది. మంగళవారం పికప్ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోయే ఆదికేశవ, కోటబొమ్మాళి పీఎస్ ఎలాంటి ఫలితాలు నమోదు చేస్తాయో చూడాలి.