ఇండస్ట్రీలో అవకాశాలు రాని కొత్తల్లో తొందరపడి కొన్ని సినిమాలు చేయడం హీరోలు, దర్శకులకు సహజమే. భవిష్యత్తులో పెద్ద స్థాయికి చేరుకున్నాక అయ్యో ఇది చేయకుండా ఉంటే బాగుండేదని అనిపించడం అందరికీ అనుభవం. ఉదాహరణకు రవితేజనే తీసుకుంటే పూరి పరిచయం కాకముందు చేసిన అన్వేషణ, మనసిచ్చాను లాంటి కంటెంట్ లేని చిత్రాలు స్టార్ డం వచ్చాక రిలీజై ఘోర పరాజయం అందుకున్నాయి. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకూ ఇలాంటి ఎక్స్ పీరియన్స్ ఉంది. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం జాతీయ అవార్డు విజేత సుధా కొంగర హఠాత్తుగా ట్రెండింగ్ లో రావడం.
మనకు ఆకాశం నీ హద్దురా దర్శకురాలిగానే తెలుసు కానీ సుధా కొంగర పరిశ్రమకు వచ్చింది 2002 మిత్ర్ మై ఫ్రెండ్ తో రచయితగా. 2008లో కృష్ణ భగవాన్ లాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులతో తీసిన ఆంధ్ర అందగాడు ఆవిడ డెబ్యూగా వికీపీడియాలో ఉంది. తమిళంలో ద్రోహితో డైరెక్టర్ గా లాంచ్ అయ్యారు. 2016 వెంకటేష్ గురు ఒరిజినల్ వెర్షన్ సాలా కద్దూస్ తో ఆవిడ టాలెంట్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. తెలుగు వెర్షన్ సుధానే డీల్ చేశారు. ఇదయ్యాకే సూర్య సూరరై పోట్రు ఛాన్స్ రావడం, ఒక్కసారిగా పెద్ద బ్రేక్ రావడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు చేస్తున్న మల్టీస్టారర్ లో సూర్య, దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాసిల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ ఉంది.
ఇంతకీ సుధా కొంగర కట్ యాక్షన్ కెమెరా మొదటి సారి చెప్పింది ఆంధ్రా అందగాడుకేనా అనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. సోషల్ మీడియాలో దీని మీద భారీ ఎత్తున ఆశ్చర్యాలు షాకులు వ్యక్తమయ్యాయి. ఎందుకంటే అదో బి గ్రేడ్ కామెడీ సినిమా కాబట్టి. ఒకవేళ కాదని ఖండిస్తే అనవసరంగా లేని ప్రచారాన్ని కల్పించినట్టు అవుతుంది. లేదూ ఒప్పేసుకుంటే మీరు ఇలాంటి చిత్రం ఎందుకు చేశారని మీడియా అదే పనిగా గుర్తు చేస్తుంది. ఏది చేసినా ఇబ్బందే. అందుకే మిత్రులు దీన్ని తన దృష్టికి తీసుకెళ్లినా మౌనంగా ఉండటమే ఉత్తమమని ఆ టాపిక్ ని అక్కడితో వదిలేయమని చెప్పారట.