టపాకాయల సౌండ్ సరిపోలేదు

నిన్న విడుదలైన రెండు డబ్బింగ్ సినిమాలు జపాన్, జిగర్ తండ డబుల్ ఎక్స్ తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎదురీదేలా ఉన్నాయి. కార్తీ మూవీకి ఉదయం షోల నుంచే మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. ఒరిజినల్ తమిళ వెర్షన్ కన్నా మన దగ్గరే డీసెంట్ నెంబర్స్ నమోదవుతాయని బయ్యర్లు అంచనా వేశారు. అయితే నెగటివ్ టాక్ మధ్యాన్నం నుంచే ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. కార్తీ 25వ మూవీగా ఇలాంటి కథను, దర్శకుడిని ఎంచుకోవడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పక్క రాష్ట్రంలోనే మిస్ ఫైర్ రిపోర్ట్స్ వస్తున్న తరుణంలో పికప్ చూపించడం కష్టమే.

ఇక జిగర్ తండ డబుల్ ఎక్స్ లో టెక్నికల్ టేకింగ్ కి మంచి మార్కులు పడుతున్నా నెమ్మదైన టేకింగ్, మన నేటివిటికి దూరంగా అనిపించే వాతావరణం తెలుగు ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేయలేకపోతోంది. అయినా సరే జపాన్ కన్నా కొంచెం ఎక్కువ ఎడ్జ్ తీసుకుని నిన్న సాయంత్రం నుంచి కొంచెం మెరుగుదల చూపిస్తోంది. అయితే అనూహ్యం అనిపించే అద్భుతాలు జరగడం అనుమానమే. రిలీజ్ కు ముందు ఎన్ని ప్రమోషన్లు చేసినా అవి ఓపెనింగ్స్ గా మారకపోవడం కార్తీ, లారెన్స్ లకు ఇబ్బందిగా మారింది. స్వయంగా వాళ్లే వచ్చి రోజుల తరబడి హైదరాబాద్ లో పబ్లిసిటీ చేసినాప్రయోజనం రాలేదు.

రేపు టైగర్ 3 రెస్పాన్స్ ని బట్టే వీటి రేంజ్ ఎక్కడ ఆగుతుందనేది తెలుస్తుంది. పఠాన్, జవాన్ రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తున్నా టాక్ బాగుంటే మాత్రం వేగంగా పికప్ ఉంటుంది. ఇక ఒకే స్ట్రెయిట్ మూవీ అలా నిన్ను చేరిని ఎవరూ పట్టించుకోలేదు. హెబ్బా పటేల్ తప్ప తెలిసిన మొహాలు లేకపోవడంతో ఆడియన్స్ లైట్ తీసుకున్నారు. జనాలంతా దీపావళి పండగ మూడ్ లో షాపింగులు, టపాసుల కొనుగోలు, లక్ష్మి పూజ ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో థియేటర్లకు వెళ్లే మూడ్ లో పెద్దగా లేరు. ఒకరకంగా చెప్పాలంటే ఆదికేశవ వాయిదా వేసుకుని మంచి పనే చేసింది.