టాలీవుడ్ తండ్రి పాత్రలకు ‘చంద్ర’ వైభవం  

అలుపెరుగని నట ప్రయాణానికి స్వస్తి చెబుతూ శాశ్వత సెలవు తీసుకున్న చంద్రమోహన్ జ్ఞాపకాలతో ఆయన సహచరులే కాదు ఇప్పటి హీరోలు కూడా తీరని లోటుని ఆవేదన రూపంలో పంచుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో తండ్రి పాత్రలకు ఒక కొత్త మలుపు ఇచ్చి డిక్షనరిగా మారిపోయేలా చేసిన కొన్ని పాత్రలను చూద్దాం. వెంకటేష్ ‘నువ్వు నాకు నచ్చావ్’లో కొడుకుని గారాబంతో చెడగొట్టిన వాడిగా నవ్వులు పంచుతూనే స్నేహితుడు ప్రకాష్ రాజ్ కుటుంబంతో ఉన్న భావోద్వేగాన్ని గొప్పగా పండించారు. ‘నిన్నే పెళ్లాడతా’లో కీలకమైన ఇంటర్వెల్ బ్లాక్ కి ఆయన పెర్ఫార్మన్స్ చాలా దోహద పడింది.

త్రివిక్రమ్ డెబ్యూ ‘నువ్వే నువ్వే’లో హాస్యం పాలు గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు. రవితేజ కృష్ణ, తరుణ్ నువ్వు లేక నేను నేను. మహేష్ బాబు ఒక్కడులో భూమిక తండ్రిగా, ప్రేమించుకుందాం రాలో వెంకటేష్ బావగా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని కనిపిస్తాయి.  ఇంకా మంచి ఉదాహరణ కావాలంటే ‘7జి బృందావన్ కాలనీ’లో రవికృష్ణ తండ్రిగా ఒకపక్క కోపం ఇంకో పక్క అంతులేని బాధ రెండూ వ్యక్త పరిచిన వైనం నభూతో నభవిష్యత్. తమిళ వెర్షన్ లో వేరే నటుడితో ఇదే పాత్ర చేయిస్తే తేలిపోయింది. దీన్ని బట్టే చంద్రమోహన్ తనకిచ్చే పాత్రలకు ఎలాంటి లైఫ్ ఇచ్చేవారో అర్థమవుతుంది.

2000 సంవత్సరం తర్వాత చంద్రమోహన్ ఈ తరహా క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయారు. నాగార్జున ‘మన్మథుడు’లో కనిపించే కాసేపు సీరియస్ గానే ఉన్నా ఉనికిని చాటుకోవడం ఆయనకే చెల్లింది. డీజేలో వంటవాడిగా పండించిన ఎమోషన్ గురించి అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా చెప్పాడు. ‘వసంతం’లో సోఫాలో కూర్చుని నవ్వుతూనే చనిపోయే సీన్ ని ఇప్పటికీ మీమ్స్ గా వాడుతూనే ఉంటారు. ఇంకా వెనక్కు వెళ్లి బ్లాక్ అండ్ వైట్ సినిమాలు, కలర్ క్లాసిక్స్ గురించి చెప్పుకుంటూ పోతే అదో పుస్తకమే అవుతుంది. టాలీవుడ్ ఫాదర్ గా 5జి జనరేషన్ చంద్రమోహన్ అనే పేరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది