గత కొన్నేళ్లలో తెలుగులో వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద సంచలనం అంటే.. ‘బేబి’నే. హీరోగా నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్న ఆనంద్ దేవరకొండ.. పెద్దగా పేరు లేని విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్యలను లీడ్ రోల్స్‌లో పెట్టి ‘హృదయ కాలేయం’ దర్శకుడు సాయిరాజేష్ రూపొందించిన ఈ చిత్రంపై ముందు పెద్దగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ టైంకి మంచి హైప్ వచ్చింది. సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించిన స్థాయిలో విజయం సాధించింది.
ఏకంగా వంద కోట్ల గ్రాస్ మార్కుకు దగ్గరగా వెళ్లిందంటే.. ‘బ్రో’ లాంటి పెద్ద సినిమా మీద కూడా డామినేట్ చేసిందంటే ఇది ఏ స్థాయి సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ట్రెండ్ సెట్టింగ్ సినిమాను దాని మేకర్స్ అంతటితో వదిలేయట్లేదు. బేబి బ్రాండును ఫుల్లుగా వాడేసుకోడానికి సిద్ధమైపోయారు. అచ్చం బేబి తరహాలోనే ఇంకో నాలుగు టీనేజ్ లవ్ స్టోరీలు తీయడానికి దర్శకుడు సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్ రెడీ అయిపోయిన సంగతి తెలిసిందే.
అందులోంచి ఆల్రెడీ రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ఇంకో రెండు సినిమాలు త్వరలోనే మొదలవుతాయి. సాయిరాజేష్ స్క్రిప్టులతోనే ఇవి తెరకెక్కనున్నాయి. దర్శకులు మాత్రం మారుతున్నారు. సాయిరాజేష్ అన్నట్లుగా ఇవన్నీ కూడా ‘బేబి’ తరహా ‘నిబ్బా-నిబ్బి’ స్టోరీలే. మరోవైపు ‘బేబి’ని వేరే భాషల్లో రీమేక్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హిందీ, తమిళ రీమేక్స్ దిశగా చర్చ లు జరుగుతున్నాయి. ఐతే ‘బేబి’ చిత్రాన్ని తమిళ జనాలు కూడా బాగానే చూశారు.
ఓటీటీలో కూడా అది బాగా ఆడింది. మరి తమిళంలో రీమేక్ చేస్తే వర్కవుట్ అవుతుందా లేదా అన్న సందేహాలున్నాయి. అయినా కూడా రీమేక్ చేయడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. హిందీలో మాత్రం ఈ సినిమా రీమేక్ కన్ఫమ్ అయిపోయింది. ఈ విషయాన్ని ‘కోటబొమ్మాళి పీఎస్’ టీజర్ లాంచ్ కార్యక్రమంలో అల్లు అరవింద్ వెల్లడించడం విశేషం. ఎస్కేఎన్‌యే ఈ చిత్రాన్ని హిందీలో ప్రొడ్యూస్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొత్తానికి ‘బేబి’ సినిమాను దాని మేకర్స్ మామూలుగా వాడుకోవట్లేదన్న చర్చ నడుస్తోంది టాలీవుడ్లో.