గత కొన్నేళ్లలో సినిమాల బడ్జెట్లో ఎంతగా పెరిగిపోయాయో తెలిసిందే. సినిమాల మార్కెట్ కూడా పెరిగినప్పటికీ.. బడ్జెట్లు మరీ హద్దులు దాటిపోవడంతో రిజల్ట్ తేడా కొట్టినపుడు నిర్మాతలు రిస్క్‌లో పడిపోతున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. బడ్జెట్లు ఇలా హద్దులు దాటిపోవడానికి హీరోల పారితోషకాలు అసాధారణంగా పెరిగిపోఇడం ప్రధాన కారణమనే చర్చ కూడా నడుస్తోంది.
డిజిటల్ హక్కుల ఆదాయం పెరిగేసరికి అందుకు అనుగుణంగా హీరోలు పారితోషకాలు పెంచేసి నిర్మాతల్ని రిస్కులో పెట్టేస్తున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. తమ ప్రొడక్షన్ హౌస్‌లో తెరకెక్కిన కొత్త చిత్రం కోటబొమ్మాళి పీఎస్ టీజర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హీరోల పారితోషకాలు పెరిగిపోవడం సమస్యగా మారిందన్న విషయంపై ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈ అభిప్రాయాన్ని ఆయన ఖండించారు. హీరోల పారితోషకాలు మరీ ఎక్కువగా ఏమీ లేవని.. బడ్జెట్లో 20-25 శాతం మాత్రమే రెమ్యూనరేషన్ కింద హీరోలు తీసుకుంటున్నారని అరవింద్ అభిప్రాయపడ్డారు.
బడ్జెట్లు పెరుగుతున్నది హీరోల పారితోషకాల వల్ల కాదని.. ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా భారీగా తీస్తే, విజువల్‌గా గొప్పగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారని.. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమాను భారీగా తీసే క్రమంలో బడ్జెట్లు పెరుగుతున్నాయని ఆయనన్నారు. కేజీఎఫ్ అనే సినిమాలో హీరో గురించి మన వాళ్లకు పెద్దగా తెలియదని.. కానీ భారీగా తీయడం వల్లే ఆ సినిమా చూశారని.. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని.. హీరోల పారితోషకాలు బడ్జెట్లు పెరగడానికి కారణం కాదని ఆయన తేల్చి చెప్పారు.