అనిరుధ్‌ను మొన్నటిదాకా అంతలా పొగిడి…

ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే.. మరో మాట లేకుండా అనిరుధ్ రవిచందర్ పేరు చెప్పేయొచ్చు. వీక్ కంటెంట్ ఉన్న సినిమాలను కూడా తన పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్‌తో వేరే స్థాయిలో నిలబెడతాడని అతడికి పేరుంది. ముఖ్యంగా ‘జైలర్’కు అతను తెచ్చుకున్న పేరు అంతా ఇంతా కాదు. స్వయంగా రజినీకాంతే యావరేజ్‌గా ఉన్న సినిమాను అనిరుధ్ తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో బ్లాక్‌బస్టర్ రేంజికి తీసుకెళ్లాడని కొనియాడాడు.

ఇటీవలే వచ్చిన విజయ్ మూవీ ‘లియో’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అందులోనూ కొన్ని పాటలు, స్కోర్ బాగా హైలైట్ అయ్యాయి. సోషల్ మీడియాను ఊపేశాయి. అనిరుధ్‌కు తమిళులే కాక తెలుగు ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. సోషల్ మీడియాలో అతడికి మన వాళ్లు ఇచ్చే ఎలివేషన్లు మామూలుగా ఉండవు.

ఐతే నిన్నటిదాకా అనిరుధ్‌ను ఆకాశానికి ఎత్తిన సోషల్ మీడియా జనాలు శనివారం సాయంత్రం నుంచి రివర్సయ్యారు. శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇండియన్-2’ టీజర్ వచ్చినప్పటి నుంచి అనిరుధ్ విమర్శల పాలవుతున్నాడు. ఇందులో బేసిగ్గా విషయమే అంత ఎగ్జైటింగ్‌గా అనిపించలేదు. విజువల్స్‌లో భారీతనం కనిపించిందే తప్ప.. కొత్తగా, ఆశ్చర్యపరిచేలా ఏమీ కనిపించలేదు.

టీజర్ విషయంలో శంకర్ అంచనాలను అందుకోలేకపోయాడన్నది స్పష్టం. దీనికి తోడు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా నిరాశపరిచింది. ‘భారతీయుడు’కు రెహమాన్ పాటలు, స్కోర్ ఎంత పెద్ద ఎసెట్ అయ్యాయో తెలిసిందే. అవి ఒక తెలియని ఎమోషన్‌లోకి తీసుకెళ్లాయి ప్రేక్షకులను. కానీ అనిరుధ్ స్కోర్ అలాంటి ఫీల్ ఇవ్వలేకపోయింది. దీంతో శంకర్‌నే కాక అనిరుధ్‌ను సైతం టీజర్ విషయంలో విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటిదాకా కొనియాడిన వాళ్లే అనిరుధ్‌ను తిడుతుండటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.