ఈగల్ కొత్త చిక్కు వచ్చి పడింది  

ఇటీవలే టైగర్ నాగేశ్వరరావుతో ఆశించిన ఫలితం అందుకోలేకపోయిన మాస్ మహారాజా రవితేజ అభిమానులకు దాని ఫలితం కన్నా  దసరా పోటీ వల్లే ఎక్కువ నష్టపోవడం బాధిస్తోంది. ఇది డిస్ట్రిబ్యూటర్లు సైతం ఒప్పుకుంటున్న మాట వాస్తవం. సోలోగా వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యేది కాదు కానీ ఇప్పటికన్నా మెరుగైన వసూళ్లు దక్కేవనేది నిజం. అందుకే ఈగల్ కు అలాంటి సమస్య రాకుండా టీమ్ చాలా సీరియస్ గా ఆలోచిస్తోంది.

పంతానికి పోయి గుంటూరు కారం, సైంధ‌వ్‌, ఫ్యామిలీ స్టార్, హనుమాన్, లాల్ సలామ్, అయలన్ లతో పోటీ పడి రిస్క్ చేసుకోవడం కన్నా వేరే ఆప్షన్ చూస్తున్నారట. జనవరి 26 రవితేజ పుట్టినరోజు. గణతంత్రదినోత్సవం నేషనల్ హాలిడే కూడా. ఈ తేదీ సానుకూలంగా ఉంటుందని నిర్మాతలు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. అలా అని ఇక్కడ రిస్క్ లేదని కాదు. హృతిక్ రోషన్ ఫైటర్, విక్రమ్ తంగలాన్ అదే డేట్ కి రాబోతున్నాయి. డబ్బింగ్ సినిమాలు కాబట్టి మరీ ఎక్కువ భయపడాల్సిన పని లేదు కానీ థియేటర్ల పంపకాల దగ్గర ఇవి గట్టి ప్రభావమే చూపిస్తాయి.

ఒకవేళ పండగ రేస్ నుంచి ఒకటో రెండో తప్పుకుంటే అవి కూడా 26 మీదే కన్నేస్తాయి. సో ఈగల్ కు కాంపిటీషన్ లేకుండా బరిలో దిగడం కష్టమే అనిపిస్తుంది. దాన్ని ఫేస్ చేయక తప్పదు.నిర్ణయం ఇంకా వెలువడకపోయినా ప్రస్తుతానికి ఈగల్ ఇంకా జనవరి 13కే కట్టుబడి ఉంది. రవితేజ మాత్రం మరోసారి ఆలోచించుకోమని, టైగర్ నాగేశ్వరరావుకు జరిగిన పరిణామాలను ఉదాహరణగా చూపిస్తున్నారట.

పైగా ఈగల్ ప్యాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేనికి దర్శకుడిగా ఇది రెండో మూవీ. ముందు సూర్య VS సూర్య చేశాడు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో స్టైలిష్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దారనే టాక్ ఉంది. సంక్రాంతికి ఎక్కువగా ఫుల్ వచ్చేది మసాలా కమర్షియల్ సినిమాలకు. మరి ఇదంతా దృష్టిలో ఉంచుకుని ఈగల్ తగ్గేదేలే అంటుందా లేక ప్రాక్టికల్ గా ఆలోచిస్తుందా వేచి చూడాలి.