జవాన్ తర్వాత సరైన హిట్టు లేక డల్లుగా ఉన్న బాలీవుడ్ బాక్సాఫీస్ కి గణపథ్ ఏమైనా ఊపు తెస్తుందేమో అనుకుంటే అది కాస్తా బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో మొదటి స్థానం కోసం పాకులాడుతోంది. కంగనా రౌనత్ తేజస్ కనీసం కరెంటు బిల్లులు కూడా వసూలు చేయడం లేదు. సరే టైగర్ 3 దాకా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదనుకుంటే పెద్దగా అంచనాలే లేని 12త్ ఫెయిల్ బాగా పెర్ఫార్మ్ చేయడం ఊహించని పరిణామం. నిన్నటి తరం కల్ట్ దర్శకుడిగా పేరున్న విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ లో విక్రాంత్ మాసే హీరోగా నటించగా జీ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించింది.
1997 బీహార్ చంబల్ లోయలో పుట్టి పెరిగిన మనోజ్ శర్మకు పెద్దయ్యాక ఐఏఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యం. అయితే అత్తెసరు మార్కులతో చదువు సాగుతూ ఉంటుంది. పన్నెండో క్లాస్ ఫెయిలవుతాడు. ఇలా లాభం లేదని అమ్మమ్మ పెన్షన్ డబ్బులు తీసుకుని ఢిల్లీ వెళ్తాడు. తన కల నెరవేరాలంటే చాలా తతంగముంటుందని తెలియని అమాయకత్వం అతనిది. పైగా కులం వెనుకుబాటుతనం, హిందీ మీడియం అడ్డుగా నిలుస్తాయి. అప్పుడో గురువు పరిచయమవుతాడు. ఇలాంటి కఠినమైన పరిస్థితుల మధ్య మనోజ్ శర్మ ఎలా నెట్టుకొచ్చి గోల్ సాధించాడనే పాయింట్ మీద కథ నడుస్తుంది.
ఎమోషనల్ గా, స్ఫూర్తినిచ్చేలా తీయడంలో విధు వినోద్ చోప్రా తనదైన ముద్ర చూపించడంతో నిజ జీవితంలో జరిగిన ఘటన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. హృద్యమైన భావోద్వేగాలతో పాటు ఆర్టిస్టుల నటన, సహజమైన ఆర్ట్ వర్క్ కంటెంట్ ని నిలబెట్టాయి. ఇది ఎంతగా రీచ్ అవుతోందంటే తెలుగు, కన్నడ డబ్బింగ్ వెర్షన్లు ఆఘమేఘాల మీద సిద్ధం చేశారు. నవంబర్ 3న ఏపీ తెలంగాణలో రిలీజ్ చేయబోతున్నారు. బయోపిక్కులకు కాలం చెల్లిందనుకుంటున్న టైంలో ఇది సక్సెస్ కావడం విశేషమే. మరి మన ఆడియన్స్ కి ఇది ఏ మేరకు కనెక్ట్ అవుతుందో ఇంకో నాలుగు రోజులు ఆగితే తేలుతుంది.