విజయవంతంగా వరల్డ్ వైడ్ కలెక్షన్లు అయిదు వందల కోట్లు దాటేసి కోలీవుడ్ నెంబర్ 3 నుంచి ఇంకా పైకి వెళ్లేందుకు చూస్తున్న లియో ప్రభంజనం చూస్తూనే ఉన్నాం. తెలుగుతో పాటు ఇతర భాషల్లో నెమ్మదించింది కానీ తమిళంలో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు దర్శకుడు లోకేష్ కనగరాజ్ దీనికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయట పెడుతున్నాడు. లియో దాస్ ఫ్లాష్ బ్యాక్ లో చూపించిందంతా నిజం కాదని, అది కేవలం మన్సూర్ అలీఖాన్ తన దగ్గరకు వచ్చిన గౌతమ్ మీనన్ కు ఊహించుకుని చెప్పిన గతమని, అది నమ్మాలనే రూల్ ఏమీ లేదని కొత్త ట్విస్టు ఇచ్చాడు.
లోకేష్ సినిమాటిక్ యునివర్స్ లో పార్తీబన్, లియో పాత్రలు రెండూ నిజమే కానీ అవి ఒకటా లేక డ్యూయల్ రోలా అనే విషయం మాత్రం ఇప్పుడే బయట పెట్టనని చెబుతున్నాడు. తన కథలో ఏదీ అనవసరంగా ఉండదని, ప్రతి పాత్రకు లింక్ ఉంటుందని మరో ఉదాహరణ చెప్పాడు. విక్రమ్ లో వేశ్యగా నటించిన అమ్మాయి లియో కాఫీ షాప్ కి రావడం వెనుక కమల్ హాసన్ ప్రమేయం ఉంటుందని, అదెలా జరుగుతుందనేది డ్రగ్స్ మాఫియా మీద తన హీరోలందరూ కలిసి యుద్ధం చేసినప్పుడు బయట పెడతానని అంటున్నాడు. లోకేష్ మాటలను బట్టి చూస్తే అసలు విలన్ రోలెక్సేనని తేలుతోంది.
లియో దాస్ ఇంట్రో ముందు వేరే విధంగా ప్లాన్ చేసుకున్నారట. వీళ్ళ పొగాకు తోటల మీద తోడేళ్ళ గుంపు దాడి చేస్తే వాటితో లియో ఫైట్ చేయడం ఫస్ట్ రాసుకున్న ఎపిసోడ్. అయితే షూటింగ్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ కి చాలా సమయం పడుతుంది కాబట్టి అక్టోబర్ రిలీజ్ సాధ్యం కాదనే ఉద్దేశంతో దాన్ని అడవిలో పోలీసులతో సింపుల్ గా మార్చేశారు. సో అనుకున్న దానికన్నా లోకేష్ సృష్టించబోయే సినిమాటిక్ యునివర్స్ ఓ రేంజ్ లో ఉండబోతోంది. రజనీకాంత్ తో చేయబోయే సినిమా అయ్యాక ఖైదీ 2, రోలెక్స్ ప్లాన్ చేసుకున్న ఈ దర్శకుడు ఆపై విక్రమ్, లియోలకు కొనసాగింపు చేస్తాడట.