అయిదేళ్ల క్రితం నాని గ్యాంగ్ లీడర్ తో టాలీవుడ్ కు పరిచయమైన ప్రియాంక అరుళ్ మోహన్ కు ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. వెంటనే శర్వానంద్ శ్రీకారం ఛాన్స్ దక్కినా ఫలితం మాత్రం రిపీట్ అయ్యింది. అందం, టాలెంట్ రెండూ ఉన్నా సక్సెస్ కలిసిరాకపోవడంతో తమిళంకే పరిమితమయ్యింది. అక్కడ సూర్య ఈటి, శివకార్తికేయన్ డాక్టర్ – డాన్ లు వరసగా విజయం సాధించడంతో మళ్ళీ వెనక్కు చూసే అవసరం రాలేదు. ధనుష్ మొదటి ప్యాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ లోనూ కథానాయికగా ఛాన్స్ దక్కింది.
తిరిగి తెలుగు రీ ఎంట్రీకి ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన ఓజిలో ఛాన్స్ కొట్టేయడం పెద్ద బ్రేక్. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాఫియా డ్రామా మీద ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో వేరే చెప్పాలా. ఇటీవలే ఇదే డివివి బ్యానర్ లో మళ్ళీ నానితో సరిపోదా శనివారంతో ఇంకో ఆఫర్ పట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజకి జోడి కట్టే ఛాన్స్ కూడా దక్కిందట. గోపిచంద్ మలినేని దర్శకుడిగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో హీరోయిన్ ఇంకా ఖరారు రాలేదు. రష్మిక మందన్నను ట్రై చేస్తే డేట్స్ దొరకలేదు. కృతి శెట్టిని అనుకున్నారు కానీ సాధ్యపడలేదు.
ఇప్పుడు ఫైనల్ అండ్ బెస్ట్ ఆప్షన్ గా ప్రియాంక మోహన్ నే తీసుకోబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంకా అఫీషియల్ కాలేదు. కాల్ షీట్స్ తీసుకున్నాకే ప్రకటన ఇస్తారు. ఈ ఒక్క ఎంపిక తప్ప రవితేజ మూవీకి సర్వం సిద్ధం చేశారు. ఇది కూడా ఓకే అయితే ప్రియాంకా చేతిలో మొత్తం మూడు తెలుగు సినిమాలుంటాయి. అన్నీ పెద్ద హీరోలవి కాబట్టి ఏ రెండు హిట్ అయినా చాలు కెరీర్ వేగమందుకుంటుంది. ప్రస్తుతం శ్రీలీల తప్ప ఇంకో ఆప్షన్ లేకుండా పోతున్న టాలీవుడ్ కి ప్రియాంకా మోహన్ లు ఇంకా కావాలి. అందుకే సాక్షి వైద్య లాంటి వాళ్లకు సైతం అమాంతం డిమాండ్ పెరుగుతోంది.