డార్క్ టోన్ మాఫియా డ్రామాల ద్వారా యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ సృష్టించిన LCU (లోకేష్ సినిమాటిక్ యునివర్స్) మీద మాములు క్రేజ్ లేదన్న సంగతి తెలిసిందే. అతి మాములు కథలను తనదైన స్టైలిష్ మేకింగ్ తో నిలబెడుతున్న తీరు లియో లాంటి యావరేజ్ కంటెంట్ ని సైతం బ్లాక్ బస్టర్ వైపు నిలబెడుతోంది. ఇక తన హీరోలందరినీ ఎలా కలుపుతాడనే థియరీ మీద లోకేష్ మనసులో ఏముందో కానీ రచయితలు, విశ్లేషకులు దాని గురించి చాలా తెలివైన కథనాలు అల్లేస్తున్నారు. అందులో ఒకటి బాగా వైరలవుతోంది. అదేంటో చూద్దాం.
1986 లో ఏజెంట్ విక్రమ్ ప్రయాణం మొదలైంది. దేశానికి ప్రమాదకరమైన బ్లాక్ స్క్వాడ్ మిషన్ ని అంతం చేశాక అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. 1992లో రోలెక్స్ ఉద్భవించాడు. 1999లో పొగాకు మాఫియా కుటుంబానికి చెందిన లియో దాస్ చనిపోయినట్టుగా ఫ్యామిలీ రికార్డుల్లో ఉంది. తర్వాత పార్తీబన్ గా పేరు మార్చుకుని హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోయాడు. 2009 నుంచి దిల్లీ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. 2019లో శిక్ష పూర్తయ్యాక నెపోలియన్ సహాయంతో అన్బు గ్యాంగ్ ని పట్టించి కూతురు కామాక్షితో వెళ్ళిపోయాడు. అదే సంవత్సరం కర్ణన్ గా పేరు మార్చుకున్న విక్రమ్ ఉనికి బయటపడుతుంది.
ఇప్పుడు 2023 తర్వాత రోలెక్స్ ని కట్టడి చేయడానికి లియో, దిల్లీ కలిసి పూనుకోవడం LCU చివరి ఘట్టానికి దారి తీస్తుంది. దిల్లీ జైలుకు వెళ్ళడానికి కారణాలు, అతనికి రోలెక్స్ గ్యాంగ్ కి ఉన్న కనెక్షన్ ఏంటనేది ఖైదీ 2లో బయట పడ్డాక, విక్రమ్ 2లో లియోను కలిసేందుకు దారి సుగమం చేస్తారు. ఒకవేళ లోకేష్ కనక రోలెక్స్ కథను విడిగా చెప్పాలనుకుంటే అతి గతం వర్తమానం మొత్తం అందులో ఉంటుంది. సో ఫైనల్ గా కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్యలు ఇలా కలుసుకునే ఛాన్స్ ఉందన్న మాట. ఇదంతా నిజమో కాదో కానీ లోకేష్ డిటైలింగ్ మీద స్టడీ చేసిన ఓ రచయిత రాసిన వెర్షన్ ఇది. భలే ఉంది కదూ.