డబ్బు, పేరు అన్నీ ఉన్న సెలబ్రెటీలకు ఏం తక్కువ అనుకుంటాం కానీ.. వాళ్ల సమస్యలు వాళ్లకుంటాయి. సరైన కారణం లేకుండా మనో వేదనకు గురయ్యే సెలబ్రెటీలు చాలామందే ఉంటారు. దీపికా పదుకొనే, ఐరా ఖాన్ (ఆమిర్ ఖాన్ తనయురాలు) సహా చాలామంది బాలీవుడ్ సెలబ్రెటీలు డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడ్డ సంగతి తెలిసిందే. దీపికా అయితే తనకు చాలాసార్లు ఆత్మహత్య ఆలోచనలు వచ్చాయని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా కరణ్ జోహార్ నిర్వహించే కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో ఆమె మరోసారి డిప్రెషన్ గురించి మాట్లాడింది. ఆమె కొత్త విషయాలేమీ చెప్పలేదు కానీ.. తనను ఇంటర్వ్యూ చేస్తూ కరణే డిప్రెషన్ గురించి ఓపెనయ్యాడు. కొన్ని నెలల కిందట మానసిక అనారోగ్యం తనను కుంగదీసినట్లు అతను వెల్లడించాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక ఏడ్చిన విషయాన్ని అతను బయటపెట్టాడు.
‘‘కొన్ని నెలల కిందట ఒక ఈవెంట్లో నేను ఉన్నట్లుండి అస్వస్థతకు గురయ్యాను. ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి. ఏం జరుగుతోందో నాకు అర్థం కాలేదు. నటుడు వరుణ్ ధావన్ నన్ను గమనించి దగ్గరికి వచ్చాడు. అంతా ఓకేనా అని అడిగాడు. తర్వాత ఓ గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నన్ను మామూలు స్థితికి తీసుకురావడానికి ప్రయత్నించాడు.
అరగంట తర్వాత కాస్త మామూలైంది. ఫంక్షన్ నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయా. ఆ రోజు బాగా ఏడ్చేశా. తెలిసిన సైకాలజిస్టుకి ఫోన్ చేసి మాట్లాడా. నాకు ఏమవుతుందో అని భయంగా ఉందని.. త్వరలో తన కొత్త సినిమా రిలీజ్ కాబోతోందని.. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పా. ఆమె నా పరిస్థితి అర్థం చేసుకుని కొన్ని మందులు ఇచ్చింది. అవి ఇప్పటికీ వాడుతున్నా. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది’’ అని కరణ్ జోహార్ వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates