జి.వి.ప్ర‌కాష్ @ 100.. ఇది క‌దా సంచ‌ల‌న‌మంటే

ఈ రోజుల్లో ఓ సంగీత ద‌ర్శ‌కుడు వంద సినిమాల మైలురాయిని అందుకోవ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ఒక‌ప్ప‌ట్లా స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు నెల‌కో సినిమా లాగించేసే ప‌రిస్థితి లేదు. న‌టీన‌టులు, ద‌ర్శ‌కుల మాదిరే టెక్నీషియ‌న్లు కూడా నెమ్మ‌దిగానే ప‌ని చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు ఏడాదికి మూణ్నాలుగు సినిమాలు చేసినా గొప్పే అనుకునే ప‌రిస్థితి.

అలాంటిది త‌మిళ సంగీత సంచ‌ల‌నం జి.వి.ప్ర‌కాష్ కుమార్ కేవ‌లం 36 ఏళ్ల వ‌య‌సులోనే వంద సినిమాల మైలురాయిని అందుకుంటుండ‌టం అద్భుతం అనే చెప్పాలి. ఈ రోజే అనౌన్స్ చేసిన సూర్య కొత్త చిత్రానికి జి.వి.ప్ర‌కాషే సంగీతం అందించ‌నున్నాడు. తెలుగ‌మ్మాయి సుధ కొంగ‌ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తోంది. ఇందులో దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు.

ఈ చిత్రం జి.వి.ప్ర‌కాష్‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా వందో సినిమా కావ‌డం విశేషం. ప్ర‌స్తుత రోజుల్లో కేవ‌లం 36 ఏళ్ల‌కే ఈ మైలురాయిని అందుకోవ‌డం ఊహ‌కంద‌ని విష‌యం. రెహ‌మాన్ మేన‌ల్లుడైన ప్ర‌కాష్‌.. 2006లో 19 ఏళ్ల వ‌య‌సులో వెయిల్ సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అయ్యాడు. ఆ సినిమా పెద్ద హిట్ట‌యింది. త‌న‌కు మంచి పేరు తెచ్చింది. ఆ త‌ర్వాత మ‌రెన్నో క్రేజీ ప్రాజెక్టుల‌కు ప‌ని చేశాడు. 20 ఏళ్ల‌కే ర‌జినీకాంత్ సినిమా క‌థానాయ‌కుడుకి మ్యూజిక్ చేశాడు.

తెలుగులో ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్, ఎందుకంటే ప్రేమంట‌, ఒంగోలు గిత్త లాంటి మ్యూజిక‌ల్ హిట్స్ ఇచ్చాడు. 2015లో వ‌చ్చిన‌ విజ‌య్ సినిమా తెరి అత‌డి 50వ చిత్రం. ఇంత‌లోనే ఇప్పుడు వంద సినిమాల మైలురాయిని అందుకుంటున్నాడు. ఓవైపు న‌టుడిగా కూడా వ‌రుస‌బెట్టి సినిమాలు చేస్తూ.. ఇంకోవైపు పెద్ద పెద్ద ప్రాజెక్టుల‌కు ప‌ని చేస్తూ ఇంత వేగంగా వంద సినిమాల మైలురాయిని అందుకోవ‌డం అసాధార‌ణం.