ఈ మధ్య వెబ్ సిరీస్ లు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో జనంలో వీటి మీద ఆసక్తి సన్నగిల్లుతోంది. ఫ్యామిలీ మ్యాన్, బ్రీత్, మిర్జాపూర్ రేంజ్ లో అందరిని మెప్పిస్తున్నవి తగ్గిపోయాయి. గంటల తరబడి వీటి మీద సమయం వెచ్చించే ఓపిక కూడా తగ్గిపోతోంది. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఇటీవలే స్ట్రీమింగ్ మొదలైన కాలాపాని మీద పాజిటివిటి కనిపిస్తోంది. సమీర్ సక్సేనా దర్శకత్వంలో రూపొందిన ఈ సోషల్ థ్రిల్లర్ గంటకో ఎపిసోడ్ చొప్పున మొత్తం ఏడు భాగాలుగా వచ్చింది. మొదలుపెడితే ఒకేసారి చూసేయాలనిపించే కంటెంటని చెబుతున్నారు కానీ నిజంగా అంత మ్యాటర్ ఉందో లేదో ఓ లుక్ వేద్దాం
2027లో స్టోరీ మొదలవుతుంది. అండమాన్ నికోబర్ దీవుల్లో డాక్టర్ గా పని చేసే సౌదామిని(మోనా సింగ్) ఆసుపత్రిలో పదకొండు మంది జ్వరం లక్షణాలతో చేరి అనూహ్యంగా మరణిస్తారు. అచ్చం ఇలాంటి వైరస్ తోనే 1987లో వందల్లో చనిపోయారని సౌదామిని రీసెర్చ్ లో తేలుతుంది. కొత్తగా చేరిన మరో డాక్టర్ రీతూ(రాధిక మోహరోత్ర)తో కలిసి మూలాలు వెతుకుతుంది. దీనికి కారణం జస్కిన్స్ లేక్ అనే వైరసని తేలుతుంది. అదే సమయంలో ఆ ప్రాంతంలో న్యూ ఇయర్ పార్టీ జరుగుతుంది. ఎందరో కొత్తవాళ్లు అండమాన్ కు వస్తారు. వైరస్ ఆపేందుకు రీతూ చేసిన ప్రయత్నాలు ఎన్నో ఉత్కంఠ ఘటనలకు దారి తీస్తాయి.
ఇలాంటి వైరస్ కథలలో గతంలో సినిమాలు వచ్చినప్పటికీ ప్రొడక్షన్, క్వాలిటీ, క్యాస్టింగ్, కంటెంట్ పరంగా కాలాపాని చాలా భారీ బడ్జెట్ తో నిర్మించారు. విభిన్నమైన నేపధ్యాన్ని తీసుకుని, దాని చుట్టూ సహజమైన పాత్రలను అల్లుకుని, ఎంటర్ టైన్మెంట్ లేకపోయినా సరే బోర్ కొట్టించకుండా నడిపించిన తీరు ఆకట్టుకుంది. నిడివి ఎక్కువ కాబట్టి ఓపికతో చూడాలి. మొదలుపెట్టాక మరీ విసుగు రాకుండా చేయడంలో దర్శకుడు సక్సెసయ్యాడు. సామాజిక సమస్యలను బాగా టచ్ చేశారు. ఎమోషన్స్, థ్రిల్స్ సరిపడా ఉన్న కాలాపానిని తీరిక సమయంతో ట్రై చేయొచ్చు. విచ్చలవిడి బోల్డ్ కంటెంట్ లేకపోవడం పెద్ద రిలీఫ్.