పెద్ద భారం మోస్తున్న చిన్న హీరో

కొబ్బరి మట్ట, హృదయ కాలేయం లాంటి స్పూఫ్ కామెడీ సినిమాలతో మంచి హిట్లు కొట్టిన సంపూర్ణేష్ బాబు కెరీర్ అనుకున్నంత వేగంగా సాగలేదు. పదే పదే ఆ టైపు కథలే చేయడం జనానికి బోర్ కొట్టేసి తర్వాత పట్టించుకోవడమే మానేశారు. పోనీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుదామంటే సరైన అవకాశాలు రాలేదు. దీంతో అడపాదడపా దర్శనం తప్ప పెద్దగా కనిపించకుండా పోయిన సంపూ వచ్చే వారం అక్టోబర్ 27 మార్టిన్ లూథర్ కింగ్ తో థియేటర్లలో అడుగు పెడుతున్నాడు. ఇరవై రోజుల ముందే తెలుగు రాష్ట్రాల్లో పలు నగరాల్లో సాధారణ ప్రేక్షకులకు ప్రీమియర్లు వేశారు.

ఇంత ఖర్చు పెట్టి కష్టపడి తిరుగుతున్నా ఈ మార్టిన్ లూథర్ కింగ్ మీద పబ్లిక్ దృష్టి అంతగా పోవడం లేదు. అందరూ దసరా చిత్రాల మత్తులో ఉన్నారు. వేటికవే భారీ సినిమాలు కావడంతో అన్నీ చూసేయాలన్న మూవీ లవర్స్ ఎక్కువగా ఉన్నారు. భగవంత్ కేసరి, లియో, టైగర్ నాగేశ్వరరావు మూడు కవర్ చేసి పండగ సంబరాలు పూర్తి చేసుకునే లోపు నెలాఖరు వచ్చేసి పర్సులు ఖాళీ అయిపోతాయి. అలాంటి టైంలో సంపూర్ణేష్ కోసం మళ్ళీ టికెట్లు కొని థియేటర్లకు రావడం అంత సులభంగా ఉండదు. సెప్టెంబర్ చివర్లో పెదకాపు 1, చంద్రముఖి 2 లాంటి క్యాస్టింగ్ ఉన్న వాటినే ఎవరూ పట్టించుకోలేదు.

అలాంటప్పుడు సంపూర్ణేష్ కి ఓపెనింగ్స్ రావడం పెద్ద సవాలే. అసలే ఇది తమిళ మండేలాకు రీమేక్. ఒరిజినల్ వెర్షన్ చాలా బాగా పేరు తెచ్చుకుంది. పెద్దగా మార్పులు చేయకుండా యథాతథంగా తీశారు కానీ ఓటిటిలో దాన్ని చూడని వాళ్ళు మాత్రమే మార్టిన్ లూథర్ కింగ్ వైపు కన్నేస్తారు. నవంబర్ మొదటి వారం వచ్చి ఉంటే కాస్తే బెటర్ గా ఉండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ తర్వాత  దీపావళి నుంచి టైగర్ 3 తో మొదలుపెట్టి నాన్ స్టాప్ గా భారీ సినిమాలు క్యూ కడతాయి. సో మార్టిన్ లూథర్ కింగ్ కి బలగం రేంజ్ లో మాస్ వర్గాలకు కనెక్ట్ అయ్యేలా టాక్ వస్తే నిలదొక్కుకుంటుంది.