ఇప్పటి ట్రెండ్ లో ఏ స్టార్ హీరో సినిమాకైనా సంగీతం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఎంత ఖర్చయినా పర్వాలేదని ఈ విభాగం మీదే నిర్మాతలు కోట్లు ఖర్చు పెడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవరకు అనిరుద్ రవిచందర్ సంగీతమని ప్రకటించినప్పుడు అభిమానుల సంతోషం అంతా ఇంతా కాదు. అయితే క్రమంగా నెలలు గడిచే కొద్దీ ఆ ఆనందం కాస్తా ఆందోళనగా మారుతోంది. కారణం అనిరుద్ ఇటీవలి కాలంలో ఇస్తున్న సాంగ్స్ అతని స్థాయికి తగ్గట్టు లేకపోవడమే. ముఖ్యంగా లియో విషయంలో తెలుగు జనాల నుంచి వస్తున్న నెగటివ్ ఫీడ్ బ్యాక్ అంతా ఇంతా కాదు.
అసలు అనిరుద్ దేవరకు ఎన్ని ట్యూన్లు ఇచ్చాడో ఇప్పటిదాకా బయటికి రాలేదు. వాటి చిత్రీకరణ ఇంకా మొదలు కాలేదన్నది వాస్తవం. ఇది చాలా సీరియస్ ప్యాన్ ఇండియా మూవీ. హై విజువల్స్ తో సముద్రపు బ్యాక్ డ్రాప్ లో తారక్ ని మునుపెన్నడూ చూడని సరికొత్త షేడ్స్ లో దర్శకుడు కొరటాల శివ ఆవిష్కరించబోతున్నాడు. సో మ్యూజిక్ కూడా దానికి తగ్గట్టే ఉండాలి. అయితే విపరీతమైన పని ఒత్తిడి మధ్య ఉన్న అనిరుద్ చాలా ఎక్కువ సమయం దేవర కోసం కేటాయించాల్సి ఉంటుంది. హైప్ తెచ్చే విషయంలో లిరికల్ వీడియోస్ పోషిస్తున్న ప్రత్యేక పాత్ర గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు.
అందుకే ఇంత భారీ అంచనాలున్న దేవరకు అనిరుధ్ తన పీక్స్ ఇవ్వాల్సిందే. ఇది ఒక ఎత్తయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకా కీలకం. ఏప్రిల్ 5 విడుదల తేదీ ఎంతో దూరంలో లేదు. అక్టోబర్ మినహాయిస్తే కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. మార్చి రెండో వారంకల్లా బిజిఎంతో పాటు మొత్తం పూర్తి చేసి సెన్సార్ కు పంపాలి. పైగా రెండు భాగాలు కావడంతో దేవర 1కి బెస్ట్ ఇస్తేనే సీక్వెల్ మీద అంచనాలు పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే బాహుబలికి కీరవాణి ఎలాగైతే తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని రెండుసార్లు నిలబెట్టుకున్నారో అచ్చం అదే తరహాలో అనిరుధ్ నుంచి అవుట్ పుట్ రావాలి.