పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరయ్యా అంటే ముందు గుర్తొచ్చే పేరు రాజీవ్ కనకాల. స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదలుపెట్టి ఆర్ఆర్ఆర్ దాకా చిన్నదో పెద్దదో దాదాపు ప్రతి సినిమాలోనూ ఏదో ఒక పాత్ర ఉండటం చూస్తున్నాం. స్క్రీన్ మీద కన్నా ఈ ఇద్దరి బాండింగ్ పర్సనల్ గా ఎక్కువగా ఉంటుంది. ఆ చనువు ఉన్నందుకే కళ్యాణ్ రామ్ అమిగోస్ ఈవెంట్ లో సుమ అందరి ముందు దేవర అప్డేట్ గురించి అడిగింది. ఆఫ్కొర్స్ దానికి తారక్ సీరియస్ లాంటి లుక్కుతో స్పందించడం, ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో చూశాం. అంత ఫ్రెండ్ షిప్ ఉంది.
తాజాగా కొడుకు రోషన్ ని లాంచ్ చేస్తున్న రాజీవ్ కనకాల తాజాగా ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదనే దాని మీద తన వర్షన్ చెప్పాడు. ఆర్ఆర్ఆర్ కోసం ఖర్చు పెట్టిన నాలుగేళ్ల కాలంలో మూడు నాలుగు సినిమాలు చేయగలిగే అవకాశం పోగొట్టుకున్న తారక్ తర్వాత దేవర కోసం అంతే కష్టపడాల్సి రావడంతో వేరే ప్రపంచం గురించి ఆలోచించే పరిస్థితిలో లేడట. అందుకే ఫోకస్ వేరే వాటి మీద మళ్ళించలేకపోతున్నాడనేది రాజీవ్ కనకాల చెబుతున్న మాట. స్నేహితుడు నేరుగా చెప్పకపోయినా అతని తరఫున సహేతుకంగా వినిపించాడు.
ఒకరకంగా చెప్పాలంటే చాలా వేడి మీద ఉన్న పాలిటిక్స్ గురించి జూనియర్ ఎలాంటి స్టాండ్ తీసుకోకపోవడం ప్రస్తుతానికి మంచిదే అయ్యింది. తాము చేసిన పనులకు ఎవరు గళమెత్తిన చాలు వాళ్ళ మీద విరుచుకుపడుతున్న అధికార పార్టీ ధోరణికి తను కూడా బలి కావాల్సి వచ్చేది. దాని వల్ల సోషల్ మీడియా వేదికగా జరిగే ట్రోలింగ్ కి ఫ్యాన్స్ కలవరపడి సమాధానం చెప్పాల్సి వచ్చేది. దేవర రెండు భాగాలుగా ప్రకటించాక తారక్ మీద ఒత్తిడి పెరిగింది. డిసెంబర్ నుంచి వార్ 2, ఏప్రిల్ నుంచి ప్రశాంత్ నీల్ సినిమా, ఆ తర్వాత మళ్ళీ కొరటాల సెట్లో అడుగు పెట్టడం ఇలా ఇంత బిజీగా ఉంటే రాజకీయాలకు టైం ఎక్కడిది.