సినిమా హిట్టు.. కానీ ప్ర‌యోజ‌నం లేదు

హీరోగా న‌టించిన తొలి సినిమా విజ‌య‌వంతం అయితే ఇక కెరీర్ సెట్ట‌యిపోయిన‌ట్లే అనుకుంటారు. అందులోనూ మంచి బ్యాగ్రౌండ్ నుంచి వ‌చ్చిన కుర్రాడికి తొలి సినిమా స‌క్సెస్ అయితే స్టార్ ఇమేజ్ వ‌చ్చేసిన‌ట్లే. కానీ మ్యాడ్ మూవీతో అరంగేట్రంలోనే హిట్ కొట్టిన జూనియ‌ర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నె నితిన్‌కు మాత్రం ఈ సినిమా ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ది సందేహంగానే ఉంది. ఎందుకంటే  సినిమాలో త‌న పెర్ఫామెన్స్ గురించి.. అలాగే ఈ సినిమా స‌క్సెస్‌లో త‌న పాత్ర గురించి జ‌నం పెద్ద‌గా మాట్లాడ‌ట్లేదు.

సినిమా విజ‌యంలో మేజ‌ర్ క్రెడిట్ ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ శంక‌ర్‌కే ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్టిస్టుల ప‌రంగా ఎక్కువ మార్కులు సంగీత్ శోభ‌న్‌కే ప‌డుతున్నాయి. ఆ త‌ర్వాత కామెడీ త‌ర‌హా పాత్ర‌లు చేసిన‌ రామ్ నితిన్ విష్ణు లాంటి వాళ్ల‌కు కూడా మంచి అప్రిసియేష‌న్ వ‌చ్చింది. కానీ సినిమాలో కొంత హీరోయిక్ ఎలివేష‌న్లు ఉన్న నార్నె నితిన్‌కు మాత్రం న‌టుడిగా యావ‌రేజ్ మార్కులు ప‌డ్డాయి.

సినిమాలో త‌న పాత్ర అనుకున్నంత హైలైట్ కాలేదు. ఆ క్యారెక్ట‌రే మూడీ టైప్‌లో ఉండ‌గా.. నితిన్ న‌ట‌న కూడా అందుకు త‌గ్గ‌ట్లే సాగింది. క్యారెక్ట‌ర్లో డెప్త్ లేక‌పోవ‌డంతో అది పెద్ద‌గా ఇంపాక్ట్ వేయ‌లేదు. నితిన్ త‌న పెర్ఫామెన్స్‌తోనూ ప్ర‌త్యేక‌త చాటుకోలేక‌పోయాడు. సినిమాలో ఏదో ఉన్నాడంటే ఉన్నాడ‌న్న‌ట్లు త‌యారైంది నితిన్ ప‌రిస్థితి. ఐతే ఎన్టీఆర్ బావ‌మ‌రిది కాబ‌ట్టి.. అత‌డికి ఎక్కువ ఎలివేష‌న్ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డం, అత‌ణ్ని స్పెష‌ల్‌గా చూపించ‌క‌పోవ‌డం అభినంద‌నీయ‌మే.

ముగ్గురు పాత్ర‌ధారుల్లో ఒక‌డిలాగే అత‌నున్నాడు. బిల్డ‌ప్ ఎక్కువేమీ లేదు. కాక‌పోతే సంగీత్ శోభ‌న్ లాగా అత‌ను పెర్ఫామెన్స్‌తో త‌న‌దైన ముద్ర మాత్రం వేయ‌లేక‌పోయాడు. పెర్ఫామెన్స్ సంగ‌తెలా ఉన్నా.. తొలి సినిమాతో స‌క్సెస్ సాధించ‌డం మాత్రం శుభ సూచ‌కే. ఇక గీతా ఆర్ట్స్-2 బేన‌ర్లో సోలో హీరోగా చేస్తున్న సినిమాలో న‌ట‌న‌తో మెప్పించ‌డ‌మే కాక స‌క్సెస్ కూడా అందుకుంటే హీరోగా నిల‌దొక్కుకోవ‌డానికి ఛాన్సుంటుంది.