ఇంకో అయిదారు నెలల్లో రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం టాలీవుడ్ కూడా సిద్ధమవుతోంది. అదేంటి రాజకీయాలకు పరిశ్రమకు ముడి ఏంటనుకుంటున్నారా. ఎప్పుడూ లేనిది అధికార పార్టీ అజెండా కోసం వరస బెట్టి సినిమాలు రూపొందడమే దానికి కారణం. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఏపీ సిఎం జగన్ ని కీర్తించేలా రెండు చిత్రాలు సిద్ధం చేస్తున్నాడు. వాటిలో ఒకటి వ్యూహం నవంబర్ 10న మరొకటి శపథం వచ్చే ఏడాది జనవరి 25 విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు. వైఎస్ఆర్ చనిపోయాక జరిగిన పరిణామాలతో మొదలుపెట్టి జగన్ అధికారంలోకి వచ్చే దాకా జరిగే సంఘటనలు వీటిలో ఉంటాయి.
ఇవి వన్ సైడ్ లోనే చెప్పే కథలని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారికంగా పదవి లేదనే మాటే తప్పించి అన్ని విషయాల్లోనో వైసిపి స్పోక్స్ పర్సన్ గా ట్విట్టర్ లో వర్మ వ్యవహారిస్తున్న తీరుని అందరూ చూస్తున్నారు. చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ లను పదే పదే టార్గెట్ గా పెట్టుకుని వ్యంగ్యంగా, కొన్నిసార్లు మరీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్న వైనం ఈ మధ్య కాలంలో ఊపందుకుంది. అదే తన పార్టీలో ఎవరైనా మాట జారినా తప్పు చేసినా అది తనకు సంబంధం లేని విషయమనే రీతిలో వర్మ ప్రవర్తన గురించి అందరికీ ఎప్పుడో ఒక క్లారిటీ వచ్చింది.
ఈ వ్యూహం, శపథం ఆ తర్వాత ఫిబ్రవరిలో రాబోయే మహి వి రాఘవ్ యాత్ర 2 అన్నీ జగన్ ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి వాడబోతున్నారు. థియేటర్లలో ఆడినా ఆడకపోయినా వాటిలో ఉన్న విజువల్స్, డైలాగులు, సీన్లు అన్నీ ఆన్ లైన్ ప్రచారానికి బాగా ఉపయోగపడతాయి. గతంలో బాబు, పవన్ ని ఎద్దేవా చేయడానికే లో గ్రేడ్ సినిమాలు తీసిన వర్మ ఇప్పుడు అంతకన్నా బెటర్ గా తీస్తారని కాదు కానీ రూలింగ్ పార్టీ అండ ఉంది కాబట్టి క్వాలిటీ కాస్త మెరుగుపడొచ్చు కానీ ప్రెజెంటేషన్ లో మాత్రం పెద్దగా మార్పు ఉండదు. జనానికి వీటి మీద ఆసక్తి ఉండటమూ అనుమానమే.
Gulte Telugu Telugu Political and Movie News Updates