తెలంగాణ ఎన్నికలు టాలీవుడ్ నో టెన్షన్

దేశ రాజకీయాల్లో అత్యంత కీలక ఘట్టాల్లో ఒకటైన తెలంగాణ ఎన్నికల తేదీని ఎలక్షన్ కమీషన్ ప్రకటించింది. నవంబర్ 30 పోలింగ్, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందని అధికారికంగా చెప్పేసింది. దీంతో ఇవాళ్టి ఉంచే రాష్ట్రంలో విపరీతమైన సందడి నెలకొనబోతోంది. అభ్యర్థుల ప్రచారాలు, ఆర్భాటాలు, టికెట్ల పంపకాలు, సభలు, ఊరేగింపులు ఒకటా రెండా మాములు హంగామా ఉండదు. అయితే డేట్లను చూసుకున్న టాలీవుడ్ నిర్మాతలు హమ్మయ్య అనుకుంటున్నారు. ఎందుకంటే భారీ చిత్రాలేవీ ఆ టైంలో రిలీజ్ లేకపోవడంతో కలెక్షన్ల మీద ప్రభావం చూపడం లాంటివి పెద్దగా ఉండవు.

నవంబర్ 23న కళ్యాణ్ రామ్ డెవిల్ రిలీజయ్యాక చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. ఆ నెల ఆఖరి వారం ఇప్పటిదాకా ఏదీ షెడ్యూల్ కాలేదు. టిల్లు స్క్వేర్ అనుకున్నారు కానీ అది జరిగే పని కాదు. ఎలాగూ ఇప్పుడు ఎన్నికలు కాబట్టి ఆ ఒక్క ఫ్రైడేని అందరూ వదిలేస్తారు. డిసెంబర్ 1 అనిమల్ కు మాత్రమే కొంత ఇబ్బంది తలెత్తవచ్చు. అయితే అప్పటికి పోలింగ్ అయిపోయి ఉంటుంది కనక పెద్దగా ఆందోళన అక్కర్లేదు. మూడో తేదీ కౌంటింగ్ జరిగే రోజు మాత్రం జనం థియేటర్లకు వెళ్లే మూడ్ లో ఉండరు కాబట్టి ఆ ఒక్క రోజు నైజామ్ వసూళ్లకు దెబ్బ పడే ఛాన్స్ ని కొట్టిపారేయలేం.

ఇక డిసెంబర్ 7 నుంచి వచ్చే కొత్త సినిమాలకు కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో రిలీజులు ఉంటాయి. గవర్నమెంట్ కొనసాగినా మారినా అప్పటికప్పుడు దాని వల్ల వచ్చే కొత్త ఇబ్బందులు అప్పటికప్పుడు ఉండవు. సలార్ వచ్చే డిసెంబర్ 22 నాటికి టికెట్ రేట్లు, అదనపు షోల పర్మిషన్లకు మాత్రమే పని పడుతుంది. ఇక సంక్రాంతి నాటికి మొత్తం నార్మలైపోతుంది. నవంబర్ రెండో వారంలో టైగర్ 3, మూడో వారంలో ఆనంద్ దేవరకొండ గంగం గణేశా, మంగళరవారంలు మాత్రమే ఉన్నాయి. కీడా కోలా, ఆదికేశవల ఫైనల్ రన్ అప్పటికే పూర్తయిపోయి ఉంటుంది. సో కూల్ గా ఉండొచ్చు.