కమెడియన్లు హీరోలు కావడం చాలా చూశాం కానీ దర్శకులుగా మారి సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. ఏవిఎస్(సూపర్ హీరోస్), ఎంఎస్ నారాయణ(కొడుకు), ధర్మవరపు సుబ్రహ్మణ్యం(రెండు తోకల పిట్ట) ఇలా ఎందరో చేయి కాల్చుకున్న వాళ్లే ఉన్నారు. కానీ ఈ నెగటివ్ సెంటిమెంట్ కి ఎదురీది వేణు యెల్దండి బలగం రూపంలో అద్భుత విజయం సొంతం చేసుకుని ఈ ఏడాది బ్లాక్ బస్టర్స్ లో ఒకటి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడీ స్ఫూర్తితో మరో హాస్యనటుడు మెగా ఫోన్ చేపట్టబోతున్నారు. అతనే ధన్ రాజ్. గతంలో నిర్మాతగా నష్టపోయిన నేపథ్యం ఇతనిది.
సముతిరఖని ప్రధాన పాత్రలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో చాలా ఎమోషనల్ గా ఉంటుందట. ఎంటర్ టైన్మెంట్ మిస్ చేయకుండానే భావోద్వేగాలకు పెద్ద పీఠ వేస్తూ ఇంకా చెప్పాలంటే వేణు స్టైల్ లో రెండు బ్యాలన్స్ అయ్యేలా స్క్రిప్ట్ రాసుకున్నట్టు తెలిసింది. ఈ నెల 22న ఓపెనింగ్ చేసి నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అయితే థియేట్రికల్ రిలీజ్ పరంగా చిన్న సినిమాలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్న తరుణంలో ధన్ రాజ్ ముందు మాములు సవాల్ ఉండదు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే తప్ప ఇలాంటివి నెగ్గడం కష్టం.
తక్కువ షెడ్యూల్స్ లో షూట్ పూర్తి చేసేలా మొత్తం ప్లాన్ సిద్ధం చేసుకున్నారని తెలిసింది. నిర్మాత, సాంకేతిక వర్గం తదితర వివరాలు ఒకటి రెండు రోజుల్లో తెలిసిపోతాయి. నటుడిగా మంచి టైమింగ్ తో పేరు తెచ్చుకున్న ధన్ రాజ్ మరి డైరెక్టర్ గా ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి. ఈ మధ్య వేషాలు తగ్గిపోయినా అడపాదడపా దొరికిన వాటిని సద్వినియోగపరుచుకుంటున్న ధన్ రాజ్ కనక డైరెక్టర్ గా డెబ్యూతో హిట్టు కొడితే కెరీర్ ని కొత్తగా మొదలుపెట్టొచ్చు. అయితే క్యారెక్టర్ ఆర్టిస్టులతో ఆడియన్స్ ని థియేటర్ దాకా రప్పించేంత కంటెంట్ ఏం రాసుకున్నాడో వేచి చూడాలి.