లియో కాపీ సినిమానా?

ఈ ఏడాది రిలీజ్ ముంగిట సౌత్ ఇండియాలో మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘లియో’ ఒకటి. తమిళంలో ప్రస్తుతం నంబర్ వన్ హీరో అనదగ్గ విజయ్ ప్రధాన పాత్రలో ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనకరాజ్ తీస్తున్న సినిమా కావడంతో ముందు నుంచి దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ మొన్నటిదాకా ఉన్న హైప్.. నిన్న ఒక్కసారిగా తుస్సుమంది. ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో విపరీతమైన నెగెటివిటీ కనిపించింది.

అసలే ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేక నిరాశ పరిస్తే.. కథ పరంగా ఓ హాలీవుడ్ మూవీని దించేసినట్లు కనిపించడం ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న వారికి ఆగ్రహం తెప్పించింది. ట్రైలర్ చూస్తే సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ ‘ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ మూవీ స్ఫూర్తితో లోకేష్ కనకరాజ్ ‘లియో’ను రూపొందించినట్లు కనిపిస్తోంది.

‘ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’ పేరుతో 1997లో వచ్చిన గ్రాఫిక్ నవల ఆధారంగా ఇదే పేరుతో హాలీవుడ్లో సినిమా తీశారు. 2005లో వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్టయింది. అందులో టామ్ స్టాల్ అనే హోటల్ ఓనర్.. తన హోటల్లో లూటీకి ప్రయత్నించిన ఇద్దరు దొంగల్ని కాల్చి చంపేస్తాడు. దీంతో అతను హీరో అవుతాడు. మీడియా అతడి గురించి గొప్పగా రాస్తుంది. ఐతే స్టాల్‌ను ఒక గ్యాంగ్‌స్టర్ అనుకుని సిటీలో ఉన్న మాఫియా గ్యాంగులు టార్గెట్ చేస్తాయి. అతడి కుటుంబాన్ని టార్గెట్ చేస్తాయి.

దీంతో కుటుంబాన్ని కాపాడుకోవడానికి హీరో నానా అవస్థలు పడతాడు. తర్వాత స్టాల్‌లోని అసలు గ్యాంగ్‌స్టర్ బయటికి వస్తాడు. ఈ కథనే ఇండియనైజ్ చేసినట్లున్నాడు లోకేష్ కనకరాజ్. ట్రైలర్లోని చాలా షాట్లను ‘ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్’తో పోలుస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఐతే ఒకవేళ ఆ హాలీవుడ్ మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయినా.. ఉన్నదున్నట్లు దించేసి ఉండడని.. లోకేష్ టచ్ కచ్చితంగా ఉంటుందని అతడి అభిమానులు అంటున్నారు. మరి లోకేష్ ఏం మ్యాజిక్ చేశాడో తెలియాలంటే ఈ నెల 19 వరకు ఆగాలి.