ఒక్క కథతో 5 సినిమాలు తీసిన డైరెక్టర్

పూరి జగన్నాథ్ అంటే ఎప్పుడూ మాఫియా కథలే తీస్తుంటాడని విమర్శలు ఎదుర్కొంటూ ఉంటాడు. త్రివిక్రమ్ కథలు కూడా ఒకే తరహాలో నడుస్తుంటాయని ఒక విమర్శ ఉంది. ఇలా చాలామంది దర్శకులు ఒక శైలి సినిమాలకు అలవాటు పడి.. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకుండా సినిమాలు తీస్తుంటారు. ఐతే సినిమాలు విజయవంతం అయినంత వరకు సమస్య లేదు. ఐతే ఇప్పుడు ఒక దర్శకుడి గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఆ దర్శకుడు దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఒకే కథతో వివిధ భాషల్లో సినిమా తీస్తున్నాడు.

ఆ సినిమాలు సరైన ఫలితం కూడా అందుకోవట్లేదు. కానీ ఆయన మాత్రం నటీనటులను మార్చి.. అదే కథను మళ్లీ మళ్లీ తీస్తుండటం విడ్డూరం. ఆ దర్శకుడే పి.వాసు. ఆయనకు 90వ దశకంలో మలయాళంలో పెద్ద హిట్టయిన ‘మణిచిత్రతాళు’ మీద కన్ను పడింది. మలయాళ చిత్రాల మార్కెట్ చాలా చిన్నది. అప్పట్లో వేరే భాషల వాళ్లకు వాళ్ల సినిమాల గురించి పెద్దగా తెలిసేదే కాదు. అలాంటి టైంలో ఈ కథను తీసుకుని కన్నడలో ‘ఆప్తమిత్ర’ తీశాడు పి.వాసు. ఒరిజినల్‌ను మక్కీకి మక్కీ దించేయగా ఆ సినిమా కన్నడలో పెద్ద హిట్టయింది.

అప్పటికే రజినీతో తమిళంలో ఒక హిట్ సినిమా చేసిన వాసు.. ఈ కథను ఆయనకు చెప్పి ఒప్పించి ‘చంద్రముఖి’ తీశాడు. అది తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయింది. అంతటితో ఆ కథను వదిలేస్తే పోయేది. కానీ వాసు దానికి కొనసాగింపుగా కన్నడలో ‘ఆప్తమిత్ర-2’ తీశాడు. ఈసారి ఆయన కథను పెద్దగా మార్చిందేమీ లేదు. కొందరు ఆర్టిస్టులను మార్చాడు. ‘ఆప్తమిత్ర’ కథనే కొంచెం అటు ఇటు మార్చి తీస్తే.. అది కన్నడలో ఓ మోస్తరుగా ఆడింది. కానీ తెలుగులో ‘నాగవల్లి’ పేరుతో రీమేక్ చేస్తే.. ఇక్కడ మాత్రం మన ప్రేక్షకులు తిప్పికొట్టాడు.

సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. వాసు అంతటితో ఆగాడా అంటే లేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సేమ్ స్టోరీని ఆర్టిస్టులు మార్చి తమిళంలో ‘చంద్రముఖి-2’ పేరుతో తీశాడు. తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయించాడు. కానీ ఈసారి రెండు చోట్లా దారుణమైన ఫలితం ఎదురైంది. ఒకే కథను ఎన్నిసార్లు తీస్తాడంటూ ఈ సినిమా మీద ప్రేక్షకులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రివ్యూలు కూడా దారుణంగా ఉన్నాయి. సొంతంగా ఏ క్రియేటివిటీ లేకుండా.. అరువు తెచ్చుకున్న కథనే తిప్పి తిప్పి ఐదు సినిమాలు తీసి ప్రేక్షకులను ఫూల్ చేయాలని ఓ దర్శకుడు చూస్తుండటం విడ్డూరాల్లోకెల్లా విడ్డూరం. ఇకనైనా ఈ కథను వాసు వదిలేస్తాడేమో చూడాలి.