ధనుష్ రిస్క్ తీసుకుంటే కష్టం

అందరూ డిసెంబర్ మూడో వారంలో సలార్, డుంకీ పోటీ మీదే దృష్టి పెడుతున్నారు కానీ దానికి ముందు వెనుకా ఇతర విషయాలు బోలెడున్నాయి. అదే నెల 15 ధనుష్ ప్యాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ ని విడుదల చేస్తామని ఎప్పుడో ఆగస్ట్ లోనే ప్రకటించారు. అప్పటికి షారుఖ్ ఖాన్ వస్తున్న విషయం మాత్రమే కన్ఫర్మ్ అయ్యింది. బాలీవుడ్ మూవీ కాబట్టి దాన్ని పోటీగా పరిగణించాల్సిన అవసరం లేదని మిల్లర్ నిర్మాతలు భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సలార్ వచ్చే చేరడంతో కేవలం వారం రోజుల వ్యవధిలో వీలైనంత రాబట్టుకోవడం అంత సులభంగా ఉండదు.

ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు కానీ కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. అచ్చం ఇలాగే 2018 డిసెంబర్ లో ధనుష్ మారి 2 రిలీజ్ చేసినప్పుడు కాంపిటీషన్ లో షారుఖ్ ఖాన్ జీరో, యష్ కెజిఎఫ్ చాప్టర్ 1, మోహన్ లాల్ ఒడియన్, అక్వమెన్ ఉన్నాయి. అయినా సరే మారి 2 కమర్షియల్ గా మంచి విజయం సాధించింది. ఇప్పుడదే సీన్ రిపీట్ అవ్వొచ్చని మిల్లర్ ప్రొడ్యూసర్ల ధీమా. కాకపోతే అప్పుడు లేని ప్రభాస్ ఇప్పుడున్నాడు కాబట్టి డైనోసర్ ని తక్కువంచనా వేయడానికి లేదు. అందుకే తుది నిర్ణయం చాలా క్యాలికులేషన్ల మీద ఆధారపడి ఉంటుంది.

ఒకవేళ ఢీ కొట్టాలని అనుకుంటే మాత్రం తమిళంలో ఏమో కానీ ఇతర భాషల్లో కెప్టెన్ మిల్లర్ కు కష్టాలు తప్పవు. బ్రిటిష్ బ్యాక్ డ్రాప్ లో అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడిక్ డ్రామాలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ కాగా శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించారు. టీజర్ చూశాక మంచి అంచనాలు ఏర్పడ్డాయి. షూటింగ్ అయిపోయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. సంక్రాంతి ఆప్షన్ చూశారు కానీ ధనుష్ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో మామ రజనీకాంత్ లాల్ సలామ్ ఆల్రెడీ పొంగల్ ప్రకటన ఇచ్చింది కాబట్టి నో ఛాన్స్. ఫైనల్ గా ఏం డిసైడ్ అవుతారో చూడాలి.