సెప్టెంబర్: పళ్ళు తక్కువ కాయలు ఎక్కువ

కీలకమైన సెప్టెంబర్ ముగిసిపోయింది. బాక్సాఫీస్ పరంగా మంచి సీజన్లలో దీన్ని ఒకటిగా భావిస్తుంది ట్రేడ్. అందుకే సలార్ వాయిదా పడక ముందు ఏరికోరి ఈ నెలనే ఎంచుకుంది. చెప్పుకోదగ్గ సినిమాలైతే వచ్చాయి కానీ కొంచెం ఇష్టం ఎంతో కష్టం తరహాలో బాక్సాఫీస్ ఎక్కువ ఎదురు దెబ్బలే తిన్నది. ఒకటిన రిలీజైన ఖుషికి మంచి టాక్ వచ్చినప్పటికీ అది హిట్టు దిశగా తీసుకెళ్లలేకపోయింది. ఫలితంగా నైజామ్, ఓవర్సీస్ మినహాయించి నష్టాలే మిగిలాయి. వారం గ్యాప్ తర్వాత వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి పెద్దగా అంచనాలు లేకపోయినా కంటెంట్ ప్లస్ నవీన్ ప్రమోషన్ వల్ల గొప్ప విజయం సాధించింది.

జవాన్ లాంటి సునామి పోటీని తట్టుకుని వసూళ్లు రాబట్టడం చిన్న విషయం కాదు. పదిహేడో తేదీ వచ్చిన విశాల్ మార్క్ ఆంటోనీ తమిళంలో హిట్టనిపించుకున్నా తెలుగులో మాత్రం తుస్సుమంది. లౌడ్ కామెడీని టాలీవుడ్ జనాలు రిసీవ్ చేసుకోలేదు. రవితేజ నిర్మించిన చిన్న సినిమా ఛాంగురే బంగారురాజాకు పోస్టర్ ఖర్చులు రాలేదు. ఆపై వారం కన్నడ డబ్బింగ్ సప్త సాగరాలు దాటి సైడ్ ఏని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసినా ఫలితం దక్కలేదు. స్లో ఎమోషన్ మన ప్రేక్షకులకు నచ్చలేదు. ఫలితంగా వారం తిరగడం ఆలస్యం ఓటిటిలో వచ్చింది.

ఇక సలార్ వదిలేసుకున్న చివరి వారం స్కంద ఏదో అద్భుతం చేస్తుందనుకుంటే రొటీన్ ఓవర్ మాస్ కంటెంట్ తో దర్శకుడు బోయపాటి శీను నిరాశ పరిచారు. రామ్ కష్టం వృథా అయినట్టే. శ్రీకాంత్ అడ్డాల పెదకాపు 1 మరీ అన్యాయంగా బ్రేక్ ఈవెన్ లో పావు వంతు కూడా తెచ్చేలా కనిపించడం లేదు. చంద్రముఖి 2ని అవుట్ రైట్ గా తిరస్కరించేశారు. ఇవి కాకుండా చిన్న సినిమాలు వేరేవి చాలా వచ్చాయి కానీ అవన్నీ థియేటర్ అద్దెలు కూడా కిట్టుబాటు చేయలేనంత బలహీనంగా టపా కట్టేశాయి. మొత్తం ముప్పై రోజుల నిడివిలో బయ్యర్లకు వర్కౌట్ అయినవి జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలు మాత్రమే.