సలార్ సందేహాలు తీరిపోయినట్టే  

క్రమంగా మబ్బులు వీడుతున్నాయి. సలార్ విడుదల గురించి ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయినా డిస్ట్రిబ్యూషన్ వర్గాలు డిసెంబర్ 22 పక్కా అని చెబుతున్నాయి. కొన్ని ఓవర్సీస్ బుకింగ్ సైట్స్ టికెట్లు ఇంకా అమ్మకపోయినా తేదీకి సంబంధించిన కన్ఫర్మేషన్ పెట్టేశారు. నిర్మాత చెప్పనిదే ఇదంతా జరగదు. షారుఖ్ ఖాన్ డుంకీ ఉందని తెలిసినా కూడా హోంబాలే ఫిలిమ్స్ క్లాష్ కి సిద్ధమంటోంది. గతంలో జీరో టైంలో తామే నిర్మించిన కెజిఎఫ్ చాప్టర్ 1 అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించడం ఉదాహరణగా చెబుతున్నారట. పైగా ఈసారి ప్రభాస్ తోడున్నాడు.

ఇప్పుడిది ధృవీకరణ కావడం కోసం పదుల సంఖ్యలో నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. డిసెంబర్, జనవరిలో రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న వాళ్ళు సలార్ ని బట్టి తమ ప్లానింగ్ ని మార్చుకోవాల్సి ఉంటుంది. వాళ్లకున్న నెట్ వర్క్ లో ఎంత ప్రయత్నించినా బెంగళూరు నుంచి సరైన సమాచారం రాబట్టుకోలేకపోతున్నారు. అటుఇటు తిరిగి డిసెంబర్ 22 అనే మాట తప్ప మరొకటి వినిపించడం లేదట. బిజినెస్ లావాదేవీలు కూడా దానికి అనుగుణంగానే జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఆక్వామెన్ ఫాలెన్ కింగ్ డం, డుంకీలను ఓవర్సీస్ లో ఎలా ఎదురుకోవాలనే అంశం సులభంగా ఉండదు.

యుఎస్, యుకె లాంటి దేశాల్లో స్క్రీన్లను దక్కించుకోవడం పెద్ద సవాల్. సలార్ ఐమాక్స్ వెర్షన్ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో థియేటర్లను బ్లాక్ చేసుకోవడం కీలకం. ఈ కసరత్తు వల్లే అనౌన్స్ మెంట్ ఆలస్యమవుతోందని అంటున్నారు. ఇవాళ రేపో లేదా ఈ వారంలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది. క్లైమాక్స్ కు సంబంధించి కొన్ని కీలక రిపేర్లు చేయడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నాడని, ఆయన ఫ్రీ అయ్యాక ప్రమోషన్లు ఎలా చేయాలనే ప్లాన్ ని సిద్ధం చేస్తారని ఇన్ సైడ్ టాక్. సో విడుదల విషయంలో సలార్ సందేహాలు దాదాపు తీరిపోయినట్టే.