ఉస్తాద్ VS ఓజి – దోబూచులాట

ఒకపక్క వాడివేడిగా రాజకీయ పరిణామాలు, ఇంకోవైపు సినిమా షూటింగులతో పవన్ కళ్యాణ్ మాములు బిజీగా లేరు. వీలైనంత త్వరగా డేట్లు ఇచ్చేసి ఉస్తాద్ భగత్ సింగ్, ఓజిలను పూర్తి చేయాలని గట్టిగా డిసైడయ్యారు. అయితే ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతున్న పొలిటికల్ సీన్ వల్ల ఖచ్చితంగా కట్టుబడలేని ఇబ్బంది వచ్చి పడింది. ఇంకో అయిదు రోజుల్లో అక్టోబర్ ఒకటి నుంచి వారాహి యాత్ర మళ్ళీ మొదలుపెట్టబోతున్నారు. ఈలోగా వీలైనంత షూట్ చేసుకోమని దర్శకుడు హరీష్ శంకర్ కి కాల్ షీట్స్ ఇవ్వడంతో ఆఘమేఘాల మీద మైత్రి బృందం ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉంది.

ఓజిలో పవన్ లేని భాగాలను తీయడంలో సుజిత్ తలమునకలై ఉన్నాడు. ఇంకో నెల రోజులు పవన్ సహకరిస్తే చాలు దీనికీ గుమ్మడికాయ కొట్టొచ్చు. ఒకరకంగా చెప్పాలంటే ఉస్తాద్, ఓజి రెండూ సమత్రాసులో నిలబడ్డాయి. ఫస్ట్ ఏది పూర్తవుతుందంటే పవన్ దగ్గరే సమాధానం లేదు. కానీ ఎన్నికల లోపు ఒకటి రిలీజ్ చేయాలి. మాఫియా బ్యాక్ డ్రాప్ ఉన్న ఓజి కన్నా పొలిటికల్ గా పంచులు స్కోప్ ఉన్న ఉస్తాద్ నే ముందు విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన లేకపోలేదు. ఓజి లేట్ అయినా పర్లేదు కానీ క్వాలిటీ కోసం సుజిత్ ఆలస్యాన్ని భరించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

హరీష్ శంకర్ కి ఇంత రిస్క్ లేదు. కీలక మార్పులతో చేస్తున్న రీమేక్ కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు. పైగా ఓజి లాగా ముంబై లాంటి క్లిష్టమైన ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ లోనే అయిపోతోంది. అర్జెంటు అనుకుంటే అమరావతిలోనూ గుంటూరులోనో తీసేందుకు కూడా సిద్ధంగా ఉన్నాడు హరీష్. వీటి మీద ఫోకస్ ఉండటం వల్లే పవన్ హరిహర వీరమల్లుకి పూర్తిగా బ్రేక్ ఇచ్చి ఎలక్షన్ల తర్వాత దాని సంగతి చూడబోతున్నారు. మొత్తానికి ఇదంతా దోబూచులాటలా ఉంది. నెక్స్ట్ లైన్ లో ఉన్న సురేందర్ రెడ్డి బోలెడు టైం ఉండటంతో స్క్రిప్ట్ ని పక్కాగా చెక్కే పనిలో ఉన్నాడు.