అక్కినేని ఎంపీ పదవి.. అలా మిస్సయింది

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రావడం.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కావడం కొత్తేమీ కాదు. మంచి పేరున్న సినిమా నటులు చాలామందిని అధికార పార్టీలు ఎంపీలుగా నామినేట్ చేయడం కూడా ఎప్పట్నుంచో జరుగుతున్నదే. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒక దశలో రాజ్యసభ సభ్యుడు కావాల్సిందట.

కానీ చిన్న ఇబ్బంది వల్ల అది కుదరలేదని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఏఎన్నార్ శతజయంతి నేపథ్యంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏఎన్నార్‌కు ఎంపీ పదవి ఎలా మిస్సయిందో వివరించారు. ఏఎన్నార్‌కు ఎంపీ కావడం ఇష్టం లేకపోయినా.. ఆయనకు ఆ పదవి ఇప్పించాలని తాను గట్టిగా ప్రయత్నించినా వీలు కాలేదని ఆయన వెల్లడించారు.

“నాగేశ్వరరావు గారు రాజ్యసభకు వెళ్తే బాగుంటుందని నేను, మరికొంతమంది సినిమా వాళ్లం అనుకున్నాం. ఇదే విషయాన్ని వెళ్లి ఏఎన్నార్ ‌గారికి ఒకసారి చెప్పాను. ఆయన సీరియస్‌గా లుక్ ఇచ్చి.. ‘అంటే ఇప్పడు అక్కినేని వెళ్లి అడుక్కుని ఎంపీ అవ్వాలంటావా’ అన్నారు. అందుకు నేను అలా కాదు సార్ అంటే.. ‘అక్కర్లేదు. నేను ఏ పదవీ అడుక్కుని తెచ్చుకోనక్కర్లేదు’ అని కుండబద్దలు కొట్టేశారు. నేను ఇక నా ప్రయత్నం నేను చేద్దామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గారి దగ్గరికి వెళ్లాను.

అప్పట్లో నేను రోజూ చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేవాడిని. ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్లి నాగేశ్వరరావు గారిని రాజ్యసభకు పంపిస్తే పరిశ్రమకు గర్వకారణంగా ఉంటుంది. ఇండస్ట్రీ తరఫున ఈ విషయం అడుగుతున్నానని చెప్పా. అప్పుడు గుజ్రాల్‌ గారు ప్రధాని. చంద్రబాబు గారు ఎన్డీఏ సారథి. ఆయన ఏం చెబితే అది జరిగే పరిస్థితి. ఐతే అప్పటికే గుజ్రాల్ గారు షబానా ఆజ్మీకి మాట ఇచ్చారని.. ఒకేసారి ఇద్దరు నటులను రాజ్యసభకు నామినేట్ చేయడం కుదరదని.. అలా అడిగినా బాగోదని చెప్పారు. అలా ఏఎన్నార్‌కు రాజ్యసభ మిస్సయింది’’ అని తమ్మారెడ్డి వెల్లడించారు.