చంద్రముఖి 2 అసలు ట్విస్టు చెప్పేశారు

ఎప్పుడో 2003లో వచ్చిన ఐకానిక్ హారర్ బ్లాక్ బస్టర్ చంద్రముఖికి ఇప్పుడు కొనసాగింపంటే అందరికీ సవాలక్ష అనుమానాలు. పైగా ట్రైలర్ చూశాక అవి మరింత బలపడ్డాయి. దర్శకుడు పి వాసు మళ్ళీ ఒరిజినల్ వెర్షనే రీమేక్ చేశారనే కామెంట్స్ విపరీతంగా వినిపించాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కనిపించాయి. అయితే కథకు సంబంధించిన కీలక ట్విస్టు ఒకటి అనుకోకుండానే ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లో టీమ్ చెప్పేసింది. ముందు కంగనా రౌనత్ ఆ తర్వాత హీరో లారెన్స్ ఇద్దరూ అదే విషయం హైలైట్ చేయడంతో కీలకమైన ఒక క్లూ దొరికేసినట్టు అయ్యింది.

చంద్రముఖిలో జ్యోతికను ఆత్మ ఆవహిస్తుంది తప్ప నిజానికి ఆమెది టైటిల్ రోల్ కాదు. ఆమె దేహంలోకి చంద్రముఖి వచ్చి డాన్స్ చేసి రాజు మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. ఒక పెయింటింగ్ రూపంలో ఉన్న ఫోటో తప్ప ఇంకో ఆధారం ఉండదు. అయితే ఈ సీక్వెల్ లో ఒరిజినల్ చంద్రముఖిగా కంగనా రౌనత్ ని చూపించబోతున్నారు. కనిపించని దెయ్యంగానే అంత భయపెడితే ఇప్పుడు ఏకంగా నిజంగానే బంగాళాకు వస్తే జరగబోయే పరిణామాల నేపథ్యంలో కొనసాగింపు ఉంటుంది. అయితే లారెన్స్ పోషించేది రజనీకాంత్ పాత్రే అయినా దీనికి సంబంధించిన లీక్స్ మాత్రం ఇవ్వలేదు.

ప్రస్తుతానికి బజ్ పెద్దగా లేకపోయినా చేతిలో ఉన్న అయిదు రోజుల్లో పబ్లిసిటీ స్పీడ్ పెంచే పనిలో ఉంది లైకా టీమ్. ఒకవేళ రజనీకాంతే చేసి ఉంటే హైప్ ఇంకో స్థాయిలో ఉండేది కానీ మాస్ మార్కెట్ లో గట్టి పట్టున్న లారెన్స్ కూడా మంచి ఛాయస్ అనిపిస్తాడని ప్రివ్యూలు చూసినవాళ్లు అంటున్నారు. కీరవాణి సంగీతంతో పాటు భారీ తారాగణం, పెద్ద బడ్జెట్ చంద్రముఖి 2కి ఆకర్షణగా నిలుస్తున్నాయి. తెలుగులో స్కంద, పెదకాపు 1తో పోటీ పడబోతున్న చంద్రముఖి 2 సక్సెస్ మీద లారెన్స్ తో సహా అందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చూడాలి మరి ఎలాంటి కనికట్టు చేస్తుందో.