పాతికేళ్ల తర్వాత ఐష్ మనసు మారుతుందా

ఏజ్ ఎంతనేది పక్కనపెడితే మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ కున్న ఫాలోయింగే వేరు. 49 ఏళ్ళ వయసులోనూ తనదైన మేజిక్ తో మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లో మెప్పించడం చూశాం. క్యారెక్టర్ నెగటివ్ అయినా సరే తనలో పాజిటివ్ వైబ్స్ నే చూశారు ఆడియన్స్. 1997లో కెరీర్ మొదలుపెట్టిన ఐష్ ఇప్పటిదాకా ఒక్క తెలుగు సినిమా చేయలేదు. నాగార్జున రావోయి చందమామలో స్పెషల్ సాంగ్ చేయడం మినహాయించి ఎంత రెమ్యునరేషన్లు ఆఫర్ చేసినా టాలీవుడ్ హీరోలకు, దర్శక నిర్మాతలకు నిర్మొహమాటంగా నో చెప్పుకుంటూ వచ్చింది.

తమిళంకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఇద్దరు, జీన్స్, రోబో, ప్రియురాలు పిలిచింది, పీఎస్ వరకు మంచి ఫిల్మోగ్రఫీని మెయింటైన్ చేసింది. అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకుని పాపకు జన్మనిచ్చాక నటనకు బ్రేక్ తీసుకున్న ఐష్ తిరిగి ఇప్పుడు మేకప్ వేసుకుని ఆఫర్లకు ఎస్ చెబుతోంది. అందుకే చిరంజీవి 157 ముగ్గురు హీరొయిన్లలో ఒకరిగా దర్శకుడు వశిష్ట ఆమె కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్. పారితోషికం ఎంతైనా సరే ఇచ్చేందుకు యూవీ సంస్థ సంసిద్ధంగా ఉంది కానీ మెగాస్టార్ పక్కన జోడిగా కనిపించేందుకు ఆమె ఒప్పుకుంటుందా లేదానేదే సస్పెన్స్.

ఒకవేళ చేస్తే మటుకు ఫ్యాన్స్ హ్యాపీనే. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో ఎలాగూ జోడి కట్టేసింది కాబట్టి ఇప్పుడు తెలుగు మెగాస్టార్ తోనూ చేసిన అనుభవం దక్కుతుంది. కాకపోతే మెగా 157 ఫాంటసీ బ్యాక్ డ్రాప్ కాబట్టి ఎక్కువ కాల్ షీట్లు అవసరం పడొచ్చు. ముంబై నుంచి హైదరాబాద్ కు తిరిగే క్రమంలో ఖర్చు కూడా తడిసి మోపెడవుతుంది. మరో ఇద్దరి కోసం అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి కానీ వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేసింది లేనిది ఇంకా తెలియాల్సి ఉంది. కీరవాణి సంగీతం, చోటా కె నాయుడు ఛాయాగ్రహణంలో మెగా 157 రూపొందబోయే సంగతి తెలిసిందే.