పొలిశెట్టికి టాప్ బేనర్లో ఛాన్స్ 

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఒక యంగ్ హీరో.. హీరోగా తొలి సినిమాతో మొదలుపెట్టి హ్యాట్రిక్ హిట్లు కొట్టడం అన్నది అరుదైన విషయమే. నవీన్ పొలిశెట్టి ఈ ఘనతే సాధించాడు ఇటీవల. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.. ఈ మూడు చిత్రాలతో అతడి హ్యాట్రిక్ పూర్తయింది. ఈ సినిమాలు పూర్తిగా కంటెంట్ మీద ఆధారపడి సక్సెస్ అయినవి. ఏదో అదృష్టం కలిసొచ్చో.. పబ్లిసిటీ గిమ్మిక్కులతో ఆడేసిన సినిమాలు కావివి.

ఈ మూడు చిత్రాల విజయాల్లో నవీన్ పొలిశెట్టి పాత్ర అత్యంత కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నవీన్ లేని ఈ మూడు చిత్రాలను అసలు ఊహించుకోలేం అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన పెర్ఫామెన్స్‌‌తో ఆ పాత్రలు, సినిమాలను నిలబెట్టాడు నవీన్. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’తో అతడి మీద ప్రేక్షకుల్లో నమ్మకం మరింత పెరిగింది. 

నవీన్ సినిమా అంటే కళ్లు మూసుకుని థియేటర్‌కు వెళ్లిపోవచ్చు అనుకుంటున్నారు ఆడియన్స్. ఇలాంటి భరోసా కలిగించే హీరోను పెద్ద నిర్మాణ సంస్థలు ఎందుకు వదులుకుంటాయి. ఇప్పటికే వైజయంతీ మూవీస్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లలో నటించిన నవీన్.. ప్రస్తుతం టాలీవుడ్లోనే టాప్ బేనర్ అయిన మైత్రీ మూవీ మేకర్స్‌లో కూడా అవకాశం దక్కించుకున్నాడు.

తాజాగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్.. నవీన్‌ను కలిసి హ్యాట్రిక్ హిట్స్ కొట్టడంపై అభినందించారు. అంతే కాక నవీన్‌తో తమ బేనర్లో సినిమా రాబోతోందని సంకేతాలు ఇచ్చారు. కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురు చూడాలని అన్నారు. నవీన్‌తో ఒక ఎనర్జిటిక్ ఎంటర్టైనర్ చేస్తే ఎలా ఉంటుంది అంటూ ప్రేక్షకులను ఊరించారు కూడా. దీన్ని బట్టి అతి త్వరలోనే మైత్రీ సంస్థలో నవీన్ కొత్త సినిమా ప్రకటన ఉంటుందని అర్థమవుతోంది.