చిరుకు మాస్టర్ బ్లాస్టర్ విషెస్

ఆగస్టు 22.. మెగా అభిమానులకు ఇంతకంటే పెద్ద పండుగ రోజు మరొకటి ఉండదు. మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు ఇదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనపై అభిమానులు ఈ రోజున ఏ స్థాయిలో ప్రేమను కురిపిస్తారో అందరికీ తెలిసిందే. చిరు రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు దూరంగా ఉన్నపుడు కాస్త సందడి తగ్గింది కానీ.. రీఎంట్రీ ఇచ్చాక మాత్రం ఏటా ఈ రోజు సంబరాలు ఓ రేంజిలో జరుగుతున్నాయి. ఈ సారి కూడా ఏమాత్రం హంగామా తగ్గేది కాదు కానీ.. కరోనా దెబ్బతో అందుకు అవకాశం లేకపోయింది. బయట పుట్టిన రోజు వేడుకలేమీ లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం సంబరాలు మామూలుగా లేవు. నిన్న సాయంత్రం నుంచి చిరు అభిమానుల హంగామా మామూలుగా లేదు. దశాబ్దాలుగా చిరు తమనెలా అలరిస్తాడో వివరిస్తూ లక్షల మంది అదిరిపోయే పోస్టులు పెట్టి చిరుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

సెలబ్రెటీలు కూడా ఉదయం నుంచి చిరుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలో పోటీ పడుతున్నారు. ఐతే మిగతా వాళ్లందరూ శుభాకాంక్షలు చెప్పడం, చిరును పొగడ్డం ఒకెత్తయితే.. భారత క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్, భారత రత్న సచిన్ టెండుల్కర్ సైతం చిరుకు విషెస్ చెప్పడం మరో ఎత్తు. చిరును తాను హైదరాబాద్‌లో ఆయన ఇంట్లో కలిసినప్పటి ఫొటోను షేర్ చేసిన సచిన్.. ‘‘ఎప్పుడూ ఎంతో ఉత్సాహంగా, దయతో ఉండే చిరంజీవి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరెప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో, సంతోషంతో ఉండాలి’’ అని ట్వీట్ చేశాడు. చిరు ట్విట్టర్ హ్యాండిల్‌ను సైతం ట్యాగ్ చేశాడు. సచినంతటివాడు చిరు పుట్టిన రోజును గుర్తుంచుకుని ఇలా ట్వీట్ వేయడంతో మెగా అభిమానుల సంబరం మామూలుగా లేదు. దీన్ని రీట్వీట్ చేసి, స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తూ అదీ చిరు రేంజ్ అని చాటుతున్నారు. చిరు-సచిన్ ఐఎస్ఎల్ ఫుట్‌బాల్ టీం కేరళ బ్లాస్టర్స్‌లో భాగస్వాములన్న సంగతి తెలిసిందే.