తొలి టెస్టులో మణిశర్మకు డిస్టింక్షన్

తెలుగు సినిమా సంగీత చరిత్రలో మణిశర్మది ఒక ప్రత్యేక అధ్యాయం. క్లాస్, మాస్ అని తేడా లేకుండా ఎవ్వరినైనా ఉర్రూతలూగించగల సత్తా ఆయన సొంతం. 2000వ సంవత్సరానికి అటు ఇటు ఓ దశాబ్దం పాటు మణిశర్మ హవా మామూలుగా సాగలేదు. టాలీవుడ్లో ఏ టాప్ స్టార్ సినిమా అయినా ఫస్ట్ ఛాయిస్ మణిశర్మనే. ఏడాదికి రెండంకెల సంఖ్యలో సినిమాలు చేస్తూ కూడా అదిరిపోయే క్వాలిటీ ఇచ్చిన ఘనత ఆయన సొంతం. కానీ ఆయన సంగీతంలో సత్తా తగ్గకముందే ఇండస్ట్రీ జనాలు ఆయన్ని పక్కన పెట్టేశారు. అలాగని ఆయన పోరాటం ఆపలేదు. అడపాదడపా మంచి ఆడియోలతో, నేపథ్య సంగీతంతో సత్తా చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు సెకండ్ ఇన్నింగ్స్‌లో అతి పెద్ద అవకాశం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం ‘ఆచార్య’కు ఆయన సంగీత దర్శకుడు. ఈ అవకాశాన్ని మణిశర్మ ఎలా ఉపయోగించుకుంటాడు.. ఎలాంటి ఆడియో, ఆర్ఆర్ ఇస్తాడు అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

చిరు పుట్టిన రోజు కానుకగా ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి మణిశర్మ నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలిచింది. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో ఇప్పటికీ మణిశర్మ టాప్‌యే అనడానికి ఈ మోషన్ పోస్టర్ రుజువుగా నిలిచింది. ఎంతో శ్రద్ధ పెట్టి చేస్తే తప్ప ఇలాంటి స్కోర్ రాదు. మంచి సౌండ్ సిస్టంలో వింటే గూస్ బంప్స్ ఇచ్చేలా మణిశర్మ ఆర్ఆర్ ఇచ్చాడు. మోషన్ పోస్టర్‌కే ఇలా ఉంటే.. ఇక టీజర్, ఆపై ట్రైలర్.. ఆ తర్వాత సినిమాలో మణిశర్మ ఎలా విజృంభిస్తాడో అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ దశలో మెగాస్టార్ సినిమా అంటే మణిశర్మ ప్రాణం పెట్టి పని చేసి ఉంటాడనడంలో సందేహం లేదు. ఆయన కసి అంతా సినిమాలో కనిపించిందంటే.. థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. ఇంకా పాటల విషయంలో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా విడుదలవుతుందని మోషన్ పోస్టర్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.

Acharya Motion Poster - Megastar Chiranjeevi | Koratala Siva | Niranjan Reddy | Ram Charan