లారెన్స్ లకలకని అంతసేపు భరించగలరా

ఏంటో ఈ మధ్య దర్శకులు లెన్త్ విషయంలో అసలు రాజీ పడటం లేదు. దాని ప్రభావం నేరుగా ఫలితం మీద పడుతుందని తెలిసినా సరే తగ్గేదేలే అంటున్నారు. తీరా అంతా అయిపోయాక ఇలా ఊహించలేదని ఉసూరుమంటారు. అంటే సుందరానికి, ఖుషి విషయంలో ఏం జరిగిందో చూసాంగా. తాజాగా చంద్రముఖి 2 ఫైనల్ లెన్త్ ని దర్శకుడు పి వాసు లాక్ చేశారు. అక్షరాలా 2 గంటల 50 నిమిషాల పాటు సెన్సార్ కాపీని అప్రూవ్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మొదటి భాగం కన్నా ఇది నాలుగు నిముషాలు ఎక్కువ కావడం గమనించాల్సిన విషయం.

ఇంత ఎందుకంటే సినిమా చూస్తే కానీ సమాధానం దొరకదు. ఇప్పటికే ట్రైలర్ ట్రోలింగ్ కి గురయ్యింది. మళ్ళీ అదే కథను తిప్పి తీశారనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి. జ్యోతిక స్థానంలో కంగనా, రజని ప్లేసులో లారెన్స్ రావడం తప్ప ఇంకేం మార్పు లేవని అంటున్నారు. విద్యాసాగర్ కి బదులుగా కీరవాణిని సంగీత దర్శకుడిగా ఎంచుకోవడం మంచి నిర్ణయమే అయినా ఆయన పనితనం ఎంత గొప్పగా వచ్చిందో తెలియాలంటే రీ రికార్డింగ్ తో చూస్తే కానీ క్లారిటీ రాదు. ఇప్పటికైతే ప్రమోషన్ల పరంగా చంద్రముఖి 2 దూకుడుగా లేదు. హైదరాబాద్ లో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ని ఫిక్స్ చేయాల్సి ఉంది.

స్కందతో గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో చంద్రముఖి 2 బాక్సాఫీస్ రన్ అంత సులభంగా ఉండదు. కాకపోతే ముని టైపులో కనెక్ట్ అయితే మాస్ హిట్ చేసి పెడతారు. అందులో డౌట్ లేదు. పోలికల పరంగా లారెన్స్ ఒకపక్క టెన్షన్ పడుతూనే మరోపక్క కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఏ మాత్రం తేడా వచ్చినా సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తారని తెలుసు. కంగనా లాంటి పెర్ఫార్మర్ ఉంది కాబట్టి మరీ తక్కువంచన వేయడానికి లేదు కానీ ఇప్పటికైతే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించడంలో టీమ్ వెనుకబడే ఉంది. చేతిలో ఉన్న రెండు వారాల్లో పబ్లిసిటీని ఎలా ప్లాన్ చేస్తారనే దాన్ని బట్టి హైప్ ఆధారపడి ఉంది.