తెలుగులో దాదాపు నలభై ఏళ్ల నుంచి సినిమాలు చేస్తున్న నటి జయలలిత. కెరీర్లో ఒకప్పుడు ఎక్కువగా ఆమె వ్యాంప్ క్యారెక్టర్లే చేశారు. వాటితో పాటు కొన్ని సీరియస్, కామెడీ రోల్స్‌లోనూ నటించారు. ఇప్పటికీ క్యారెక్టర్ నటిగా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నారు జయలలిత. మహేష్ బాబు సినిమా భరత్ అనే నేనులో ఆమె అసెంబ్లీ స్పీకర్ పాత్రలో కనిపించడం విశేషం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జయలలిత తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ దర్శకుడు తనకు నరకం చూపించినట్లు ఆమె వెల్లడించింది. అతను తన మీద యాసిడ్ దాడి కూడా చేయబోయినట్లు వెల్లడించింది. తన హింస భరించలేక చాలా ఏళ్ల కిందటే అతడి నుంచి విడిపోయి ఒంటరిగా బతకడం మొదలుపెట్టినట్లు ఆమె తెలిపింది. నేను బేసిగ్గా క్లాసికల్ డ్యాన్సర్‌ని. దేశవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను.
అప్పట్లో కుటుంబం మొత్తం నా మీదే ఆధారపడి ఉండేది. దీంతో ఎలాంటి అవకాశౄలు వచ్చినా కాదనకుండా నటించేదాన్ని. అలాంటి సమయంలోనే వినోద్ అనే దర్శకుడిని ప్రేమించా. మేమిద్దరం ఏడేళ్ల పాటు ప్రేమించుకున్నాం. అతను తెరకెక్కించిన ఓ సినిమాలో నాతో అడల్ట్ సీన్లు కూడా చేయించాడు. తనెలాంటి వాడో అర్థమై దూరంగా ఉండాలనుకున్నా.
కానీ నన్ను పెళ్లి చేసుకోకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నా. తర్వాత నాకతను నరకం చూపించాడు. పెళ్లైన తర్వాతి రోజే నిజ స్వరూపం బయటపడింది. ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని అర్థమైంది. నన్ను గదిలో బంధించాడు. యాసిడ్ పోస్తానన్నాడు. దగ్గరి వాళ్ల సాయంతో అతడి చెర నుంచి బయటికి వచ్చేశా అని జయలలిత గుర్తు చేసుకుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates