బాలీవుడ్ విలక్షణ నటుల్లో చెప్పుకోదగిన పేర్లలో నిన్నటి తరంలో నసీరుద్దీన్, ఓంపూరి లాంటి వాళ్ళు తడితే ఇప్పటి జనరేషన్ లో నవాజుద్దీన్ సిద్ధికి ముందు వరసలో ఉంటాడు. సీరియస్ ఎక్స్ ప్రెషన్స్, కామెడీ, ఎమోషన్స్ ఏది కావాలన్నా పర్ఫెక్ట్ గా ఇవ్వడంలో ఇతని శైలి వేరు. తమిళంలో రజనీకాంత్ పేటతో ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్ తెలుగులో వెంకటేష్ ప్యాన్ ఇండియా మూవీ సైంధవ్ తో టాలీవుడ్ తెరగేంట్రం చేయబోతున్నాడు. ఇతను నటించిన కొత్త సినిమా హడ్డీ ఇటీవలే ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పాత్ర కోసం అతను చాలా కష్టపడ్డాడు.
కథ విషయానికి వస్తే ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగరాజ్ కు చెందిన హడ్డి(నవాజుద్దీన్ సిద్ధిక్)కి లింగమార్పిడి ద్వారా అమ్మాయిగా మారాలని ఉంటుంది. హిజ్రాల సంక్షేమం కోసం పాటు పడే రేవతి(ఇలా అరుణ్)సహాయంతో హారికగా మారిపోతాడు. అయితే స్థానిక రాజకీయ నాయకుడిగా చెలామణి అయ్యే కరుడుగట్టిన మాఫియా డాన్ ప్రమోద్(అనురాగ్ కశ్యప్)చేతిలో రేవతి హత్య చేయబడుతుంది. మరోవైపు హారికకి ఇర్ఫాన్(మహమ్మద్ జీషాన్ అయూబ్)తో లవ్ స్టోరీ ఉంటుంది. రేవతి మరణంతో కుదేలైన హడ్డి ప్రమోద్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక్కడ నుంచి అసలు స్టోరీ షురూ.
దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ రెగ్యులర్ రివెంజ్ డ్రామాకే హిజ్రా బ్యాక్ డ్రాప్ ని ఎంచుకోవడం బాగుంది కానీ దానికి సరైన కథా కథనాలు సమకూర్చుకోవడంలో తడబడ్డాడు. దీంతో ఫస్ట్ హాఫ్ చాలా ఉపకథలతో అవసరం లేని కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. పెర్ఫార్మన్స్ పరంగా ఆర్టిస్టులందరూ అద్భుతంగా నటించినప్పటికీ వాళ్ళు సరిగా వాడుకునే స్క్రీన్ ప్లే పడలేదు. ఫ్లాష్ బ్యాక్ సైతం గందరగోళంగానే అనిపిస్తుంది. వెబ్ సిరీస్ అనుకుని సినిమాగా మార్చే క్రమంలో జరిగిన పొరపాట్లు చాలా ఉన్నాయి. సెకండ్ హాఫ్ పర్వాలేదనిపిస్తుంది. క్లైమాక్స్ వగైరా బాగున్నప్పటికీ నవాజుద్దీన్ నటనను గొప్పగా వాడుకోవడంలో హడ్డి తడబడటంతో అంత సంతృప్తినివ్వదు.