నాగార్జున 100 – సస్పెన్స్ తీరుతోందా  

ఏఎన్ఆర్ నట వారసుడిగా విక్రమ్ తో తెరంగేట్రం చేసి యువ సామ్రాట్ నుంచి కింగ్ దాకా ప్రయోగాలకు నెలవుగా నిలిచిన నాగార్జునకు నా సామి రంగా 99వ సినిమా.  విజయ్ బెన్ని దర్శకత్వంలో మలయాళం హిట్ పోరంజు మరియం జోస్ రీమేక్ గా రూపొందుతున్న ఈ విలేజ్ డ్రామా టీజర్ ఇటీవలే ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే అందుకుంది. ఒకపక్క బిగ్ బాస్ 7 షూటింగ్ తో పాటు దీన్ని కూడా సమాంతరంగా ప్లాన్ చేసుకున్న నాగ్ ఎలాగైనా సంక్రాంతి బరిలో దిగాలని చూస్తున్నారు కానీ అదెంత వరకు సాధ్యమో కనీసం షూటింగ్ అయితే కానీ చెప్పలేం. సో టైం పడుతుంది.

దీని సంగతలా ఉంచితే నాగార్జున వందో సినిమా గురించిన సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసమే గాడ్ ఫాదర్ దర్శకుడు మోహన్ రాజా ఒక లైన్ గతంలోనే వినిపించాడు. నాగ్ తో పాటు అఖిల్, చైతులు కూడా ఉండేలా స్టోరీ బాగా వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది. కానీ మెగా మూవీ ఫలితం కొంచెం అటుఇటు కావడంతో ఇది కాస్తా పెండింగ్ లో పడిపోయింది. ఈలోగా మోహన్ రాజా తమిళంలో తని ఒరువన్ 2కి కమిటైపోయాడు. ఎంతలేదన్నా దానికో ఏడాదికి పైగానే సమయం పడుతుంది. స్వంత తమ్ముడి సినిమా కాబట్టి జాగ్రత్తగా చెక్కుతారు.

నాగ్ దగ్గర రెండు మూడు ఆప్షన్ లైతే ఉన్నాయట. మొదటిది రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రూపొందబోయే ప్యాన్ వరల్డ్ మూవీలో ఒక కీలక పాత్ర ప్రతిపాదన కింగ్ దగ్గరికి వచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. ఇది ఓకే చేస్తే మల్టీస్టారర్ అవుతుంది కానీ సోలో హీరో అకౌంట్ లోకి రాదు. ఒకవేళ ఒప్పుకున్నా ఇది 101 లేదా 102 అవ్వొచ్చు. ఎందుకంటే జక్కన్న తీసే విధానం తెలుసుగా. కనీసం రెండేళ్లు పడుతుంది. ఈలోగా నాగార్జున చాలా సులభంగా రెండు మూడు సినిమాలు చేసుకోవచ్చు. కాకపోతే దర్శకుడిని సెట్ చేసుకోవడం పెద్ద సవాల్. స్టార్ డైరెక్టర్లందరూ బిజీగా ఉన్నారు. సో వెయిట్ చేయాల్సిందే