చివ‌రికి సుకుమారే గెలిచాడు

తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఆడియన్స్ అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘పుష్ప-2’ ఒకటి. రెండేళ్ల కిందట పాన్ ఇండియా స్థాయిలో సంచలన విజయం సాధించిన ‘పుష్ప’కు కొనసాగింపుగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో, పైగా ఇటీవలే ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులు సాధించడంతో దీనికి హైప్ అమాంతం పెరిగిపోయింది. ఐతే షూట్ మొదలు కావడంలోనే చాలా ఆలస్యం జరగడంతో సినిమా అనుకున్న సమయం కంటే చాలా ఆలస్యంగా రిలీజ్ కాబోతోంది.

ఆ డేట్ విషయంలో కూడా చాన్నాళ్లుగా సందిగ్ధత నెలకొంది. ఎట్టకేలకు అనిశ్చితికి తెరదించుతూ ‘పుష్ప-2’ రిలీజ్ డేట్ ఇచ్చేశారు. 2024 ఆగ‌స్టు 15న ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ట్లు చిత్ర బృందం ప్ర‌క‌టించింది. అంటే పుష్ప‌-2 ఆగ‌మ‌నం కోసం ఇంకో 11 నెల‌లు ఎదురు చూడాల‌న్న‌మాట‌. పుష్ప‌-2 రిలీజ్ మ‌రీ ఇంత లేటుగా ఉంటుంద‌ని అభిమానులు ఊహించ‌లేదు. వ‌చ్చే మార్చి 22నే సినిమా రిలీజైపోతుందంటూ కొన్ని రోజులుగా గ‌ట్టిగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

నిజానికి నిర్మాత‌లు కోరుకున్న డేట్ ఇదేన‌ట‌. బ‌య్య‌ర్ల‌కు కూడా ఒక ద‌శ‌లో ఈ డేటే చెప్పార‌ట‌. అదే డేట్ అనౌన్స్ చేద్దామ‌ని కూడా కొన్ని రోజుల కింద‌ట ఫిక్స‌య్యార‌ట‌. కానీ సుకుమార్ ఆ డేట్ అందుకోవ‌డం అసాధ్యం అని అడ్డు ప‌డ్డ‌ట్లు స‌మాచారం. రిలీజ్ ఉంటుందో లేదో మార్చి డేట్ ఇద్దామ‌నే నిర్మాత‌లు అన్నా.. సుకుమార్ ఒప్పుకోలేద‌ని స‌మాచారం. మార్చి డెడ్ లైన్ పెడితే సుకుమార్ కొంచెం వేగంగా సినిమా తీస్తాడ‌ని.. ఒక‌వేళ కొంత ఆల‌స్యం అయినా వేస‌వి చివ‌ర్లో రిలీజ్ చేద్దామ‌ని నిర్మాత‌లు అనుకున్నార‌ట‌.

కానీ షూటింగ్ ఇంకా 50 శాతం కూడా పూర్తి కాకుండా ఇంత భారీ చిత్రాన్ని ఆరు నెలల్లో బహు భాషల్లో రిలీజ్ చేయడం అంత తేలికైన విషయం కాదు. వివిధ భాషల్లో పక్కాగా డబ్బింగ్, ప్రిి ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేయడానికి కనీసం మూడు నెలలు టైం కావాలి. కాబట్టి వేస‌వి చివ‌రికి కూడా సినిమాను రెడీ చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన సుకుమార్.. నామ‌మాత్రంగా డేట్ ఇచ్చి వాయిదా వేయ‌డం ఎందుక‌ని ఆగ‌స్టు 15ను ఫైన‌లైజ్ చేయించి అనౌన్స్ చేయించిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి నిర్మాత‌లు ఏమ‌నుకున్నా.. చివ‌రికి సుకుమారే గెలిచాడ‌ని యూనిట్ వ‌ర్గాలు అనుకుంటున్నాయి.