ఈ ఏడాది జాతీయ అవార్డుల ప్రకటన సందర్భంగా సందడంతా టాలీవుడ్‌దే. ఏకంగా 11 అవార్డులను సొంతం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటింది మన సినీ పరిశ్రమ. ఐతే ఆ అవార్డులను టాలీవుడ్ ఆశించిన స్థాయిలో సెలబ్రేట్ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ‘పుష్ప’ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ మాత్రమే సంబరాల్లో మునిగి తేలాడు.
ఇండస్ట్రీ జనాలతో పాటు మీడియా వాళ్లకు, సన్నిహితులకు పార్టీలు ఇచ్చాడు. ఇంకెవ్వరూ కూడా పెద్దగా సెలబ్రేషన్స్ చేయలేదనే చెప్పాలి. ఆరు అవార్డులు గెలిచిన ‘ఆర్ఆర్ఆర్’ టీం నుంచి సౌండే లేదు. ‘పుష్ప’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికైన దేవిశ్రీ ప్రసాద్ అయితే అసలెక్కడా కనిపించలేదు. కనీసం అతను ‘పుష్ప’ టీంను అయినా కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడా అంటే అది కూడా లేదట.
జాతీయ అవార్డులు ప్రకటించి రెండు వారాలు దాటగా.. ఇప్పటిదాకా తాను హైదరాబాద్‌కు రాలేదని, ‘పుష్ప’ టీంను కూడా కలవలేదని దేవిశ్రీ ప్రసాద్ చెప్పాడు. ‘‘జాతీయ అవార్డు సాధించినపుడు నేను చెన్నైలో ఉన్నా. బన్నీ నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతుండగానే.. అతడికి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినట్లు తెలిసింది. మా ఆనందం రెట్టింపైంది. ఐతే నేను అప్పటికే ఫుల్ బిజీగా ఉన్నా.
ఆ తర్వాత కూడా తీరిక లేదు. దీంతో హైదరాబాద్ రావడానికి అవకాశం లేకపోయింది. ఇంకా పుష్ప టీంను కలవలేదు. సెలబ్రేట్ చేసుకోలేదు. జాతీయ అవార్డు సాధించడానికంటే ముందు ‘పుష్ప’ పాటలు ప్రేక్షకులకు అమితంగా నచ్చి గొప్ప ఆదరణం పొందడం ఇంకా పెద్ద అవార్డు. ఇప్పుడు నాపై మరింత బాధ్యత పెరిగింది. ‘పుష్ప’ను మించి ‘పుష్ప-2’కు పాటలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా. ప్రస్తుతం ‘పుప్ప-2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది’’ అని దేవి తెలిపాడు.