కొన్ని క్లాసిక్స్ ఎన్ని సంవత్సరాలు గడిచినా అలా గుర్తుండిపోతాయి. వాటిలో ఒకటి 2007లో వచ్చిన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. వెంకటేష్ హీరోగా సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ లవ్ కం ఎమోషనల్ ఎంటర్ టైనర్ అప్పట్లో అంచనాలకు మించి ఆడింది. ముందు ఒక భాషలో తీసి చూద్దామనుకుని తెలుగులో విడుదల చేస్తే దానికొచ్చిన స్పందన చూసి మరుసటి ఏడాదే ధనుష్ తో తమిళంలో రీమేక్ చేశారు. ఆ తర్వాత బెంగాలీ, భోజ్ పూరి, కన్నడ, ఒడియా తదితర లాంగ్వేజెస్ లో పునః నిర్మితం చేశారు. ఎన్ని వచ్చినా వెంకీ వెర్షనే అన్నింటిలోకి చాలా స్పెషల్ అండ్ ఒరిజినల్ అనిపిస్తుంది.
ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణముంది. 2013లో దర్శకుడు సెల్వ రాఘవన్ ఒక ట్వీట్ చేశారు. చాలా రోజుల తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చూశానని, వెంకటేష్ త్రిషలతో పని చేయడం గొప్పగా ఉందని, సీక్వెల్ చేస్తే బాగుంటుందని అందులో పేర్కొన్నారు. సరిగ్గా పదేళ్ల తర్వాత త్రిషకు ఏం గుర్తొచ్చిందో ఏమో కానీ ఇప్పుడు సమాధానమిస్తూ నేను సిద్ధంగా ఉన్నానని రీట్వీట్ చేశారు. అదేదో అప్పుడే చెప్పి కొనసాగింపు తీయించి ఉంటే బాగుండేది కదానే అభిప్రాయం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది. ఎలాగూ యువన్ శంకర్ రాజాతో సహా టీమ్ మొత్తం అందుబాటులో ఉంది.
వినడానికి బాగానే ఉన్న ఇప్పుడా క్లాసిక్ కంటిన్యూ చేయడం సులభం కాదు. ఎందుకంటే సెల్వ రాఘవన్ నటనతో పాటు యుగానికి ఒక్కడు 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతకు ముందులా వేగంగా సినిమాలు తీయడం లేదు. వెంకటేష్ అడిగితే నో చెప్పరు కానీ అసలు కథంటూ చేతిలో ఉండాలిగా. ఇదేమో కానీ ఒకవేళ రీ రిలీజ్ కు ప్లాన్ చేసుకుంటే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం లేకపోలేదు. వెంకీ కోట మధ్య ఎమోషన్, త్రిష అందం, సెకండ్ హాఫ్ లో విశ్వనాథ్ కుటుంబం కామెడీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని కంటెంట్ ఇది. థియేటర్లలో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు.