కరోనా మహమ్మారి బారిన పడ్డ దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొన్ని రోజుల పరిస్థితి విషమించి ఐసీయూలో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారన్న సమాచారం బయటికి వచ్చిన దగ్గర్నుంచి ఆయన అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. తమ ఇంట్లో మనిషి ఆ స్థితిలో ఉన్నట్లుగా జనాలు బాధ పడుతున్నారు.. తన పాటలతో అపరిమిత ఆనందాన్ని ఇచ్చిన ఆయన క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తన్నారు. అయితే బాలు ఆరోగ్య స్థితి గురించి రోజుకో రకంగా అప్ డేట్ వస్తుండటం వారిని కలవర పరుస్తోంది. ముందు ఆయన పరిస్థితి విషమం అన్నారు.. తర్వాత కోలుకున్నట్లు వార్తలొచ్చాయి.
కానీ గత రెండు రోజుల్లో పరిస్థితి మళ్లీ విషమించినట్లు అప్ డేట్ రావడం.. బాలు తనయుడు ఎస్పీ చరణ్ గురువారం నాటి అప్ డేట్ ఇస్తూ తీవ్ర భావోద్వేగానికి గురికావడంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఎక్కడ చేదు వార్త వినాల్సి వస్తుందో అని కంగారు పడ్డారు. ఐతే వారి ఆందోళన తగ్గించే అప్ డేట్ ఇచ్చాడు చరణ్ శుక్రవారం. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందన్న అతను.. ఆయన కోసం ప్రార్థనలు కొనసాగించాలన్నాడు. బాలు కోలుకున్నట్లు కాదని.. కానీ డాక్టర్లు తాజా బులిటెన్లో క్రిటికల్ అనే పదం వాడకుండా స్టేబుల్ అనడం మాత్రం ఊరటనిచ్చే విషయమని అతనన్నాడు. చరణ్ కూడా కొంచెం ప్రశాంతంగా కనిపించడం.. బాలుకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రి ఇచ్చిన బులిటెన్లోనిజంగానే ఎక్కడా క్రిటికల్ అనే పదం వాడకపోవడం బాలు అభిమానులకు ఉపశమనమే.